(Source: ECI/ABP News/ABP Majha)
Nadendla Manohar On Ysrcp : విశాఖ పెట్టుబడుల సదస్సు అంకెల గారడీ, సీఫుడ్స్ లో కోడిగుడ్డు ఘనత వైసీపీదే- నాదెండ్ల మనోహర్
Nadendla Manohar On Ysrcp : విశాఖ పెట్టుబడుల సమ్మిట్ అంతా అంకెల గారడీ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గతంలో ఎప్పుడూ చేసుకున్న ఒప్పందాలకు ఇప్పుడు ఎంవోయూలు చూపిస్తున్నారని ఆరోపించారు.
Nadendla Manohar On Ysrcp : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, పలువురు నేతలు జనసేనలో చేరారు. అనంతం మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ .. విశాఖ పెట్టుబడుల సదస్సుపై స్పందించారు. వైజాగ్ లో రెండు రోజులు పాటు జరిగిన పెట్టుబడుల సమావేశాలు యువతను మభ్యపెట్టే విధంగా ఉన్నాయని విమర్శించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు సుమారు 170 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టారన్నారు. కోడిగుడ్లను కూడా సీ ఫుడ్ లో కలిపేసిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందన్నారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీతో రెండున్నర సంవత్సరాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని, ఇప్పుడు మళ్లీ ఎంవోయూ చేసిందని దీని వెనుక పరమార్థం ఏమిటో మాకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వంలో నిజాయితీ చిత్తశుద్ధి లేవని నాదెండ్ల విమర్శించారు. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మోసపూరితంగా ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం నాయకత్వం లేని ముఖ్యమంత్రి ఇది మన ప్రస్తుత పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. ఐటీ ఎగుమతుల్లో మన రాష్ట్రం దేశంలోనే అతి తక్కువ స్థానంలో ఉందని గుర్తుచేశారు. పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అంకెల గారడీల కనిపిస్తోందన్నారు.
అంకెల గారడీ
విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు అంతా అంకెల గారడీ. ప్రజల్ని మోసం చేసే అభూత కల్పనల కార్యక్రమం అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చేసిన హడావిడి మొత్తం మోసపూరితమన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడం, అంకెల గారడీతో యువతలో ఆశలు రేకెత్తేలా చేస్తున్న తప్పుడు ప్రచారాలను జనసేన పక్షాన తప్పుబడుతున్నామన్నారు. ఎన్నికల ముందు జగన్ వస్తేనే జాబ్స్ వస్తాయని నమ్మించి యువతను మోసం చేశారన్నారు. రాజధాని లేని రాష్ట్రం... నాయకత్వం లేని ముఖ్యమంత్రి... ఎవ్వరిలో నమ్మకం కలిగిస్తారని ప్రశ్నించారు. అమరావతి కలను చంపేశారని, ఈ ప్రభుత్వం మీద పెట్టుబడిదారులకు ఏ విధంగా నమ్మకం కలుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సు... రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెబితే రాష్ట్రంలో ఒక మంచి వాతావరణ కల్పించాలన్న ఉద్దేశంతో పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో రెండు రోజులపాటు ఆ సదస్సుపై రాజకీయపరమైన విమర్శలు చేయరాదని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ మొదటి నుంచి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలని కోరుకుంటోంది. ఎన్నికల ముందు ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో కూడా పవన్ కల్యాణ్ రాష్ట్రంలోకి ఎంతో మంది పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్లాలన్నదే పవన్ కల్యాణ్ ఆలోచన. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్తలను గౌరవించి వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జనసేన పార్టీ ఆకాంక్షించింది. అయితే ప్రభుత్వం రెండు రోజుల పాటు రూ.175 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి అంకెల గారడీ చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది. ఎన్నికల ముందు జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని... పారిశ్రామికవేత్తగా ఆయనకున్న అనుభవంతో ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తెస్తారని ప్రజలు నమ్మారు. నాలుగేళ్ల పాలనలో అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు." అని అన్నారు.
ముఖ్యమంత్రి అవగానే రిలయన్స్ పై కక్ష
జగన్ సీఎం అవ్వగానే దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ మీద కక్ష కట్టారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తిరుపతిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారన్నారు. వారికి కేటాయించిన భూమి కూడా వెనక్కి తీసేసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే రిలయన్స్ కి సంబంధించిన వారికి రాజ్యసభ సీటు కేటాయించారని, మొన్న ముకేష్ అంబానీ విశాఖ వచ్చారని, ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ఎక్కడైనా తన ప్రసంగంలో చెప్పారా? పెట్టుబడి ప్రణాళికలు ఏమైనా 'చూపారా? అలాంటిదేమీ లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని నాదెండ్ల అన్నారు. క్లిన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, రెన్యువబుల్ ఎనర్జీ గురించి అద్భుతంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ముందుకు దూసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారని, హైకోర్టు ఈ విషయంలోనే కదా అక్షింతలు వేసిందన్నారు. రాయలసీమలో సోలార్ ఎనర్జీ సంస్థలకు డబ్బులు చెల్లించకుండా రెండున్నరేళ్లు ఇబ్బందిపెడితే.. వారు హైకోర్టును ఆశ్రయిస్తే... హైకోర్టు వారికి బిల్లులు క్లియర్ చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం మర్చిపోయారా అన్నారు. అటువంటిది ఈ రోజున కొత్త ఒప్పందాలు చూపించుకుంటున్నారన్నారు. ఇందులో వేటికీ పర్యావరణ క్లియరెన్సులు లేవన్నారు. ఎగువ సీలేరు, దిగువ సీలేరుల్లోనే కేటాయింపులు చేశారని, ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యావరణ అనుమతులు వస్తాయా? ఎవర్ని మభ్యపెడుతున్నారు? అదానీకి అక్కడ ఇచ్చేశాం... త్వరలోనే రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటనలు చేసుకుంటుంటే వాటి గురించి ప్రస్తావించాల్సి వస్తోందన్నారు.
ఐటీ మంత్రి కోడి గుడ్డును మర్చిపోలేకపోతున్నారు
"ఐటీ శాఖ మంత్రి కోడి గుడ్డును మర్చిపోలేకపోతున్నారు. వారి శాఖ విడుదల చేసిన ప్రకటనలో సీ ఫుడ్ లో కోడి గుడ్లను కూడా కలిపేశారు. సీ ఫుడ్ అంటే చేపలు, రొయ్యలు అని మనకు తెలుసు. మరి కోడి గుడ్డు ఆ జాబితాలోకి ఎలా చేరింది? భారతదేశంలోనే సీ పుడ్ ఎక్స్ పోర్టులో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని చెబుతున్నారు. ఇటువంటి మంత్రులు, శాఖల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు. విశాఖ సదస్సుని లోతుగా చూస్తే ఫిబ్రవరిలో జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు మీట్ లో ఎన్టీపీసీ రూ. లక్షా
17 వేల కోట్లు 2027 నాటికి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ప్రకటన చేశారు. దాన్ని పెట్టుబడుల సదస్సులో రూ.2 లక్షల 37 వేల కోట్లుగా చూపారు. టూరిజం సెక్టార్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిమిత్తం తిరుపతి, విశాఖల్లో ఒబెరాయ్ సంస్థకు ఇప్పటికే భూములు కేటాయించారు. గోడలు కూడా కట్టేశారు. విశాఖలో ఎంవోయూ చేశారనీ.. రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు అని ప్రకటనలు చేస్తున్నారు. బ్లూస్టార్ సంస్థకు సంబంధించిన యూనిట్ శ్రీ సిటీ ఎస్‌ఈజెడ్ లో ఇప్పటికే నడుస్తోంది. వీటినీ ప్రారంభోత్సవ, ఒప్పంద జాబితాలో చూపించారు. శ్రీ సిటీ తెచ్చిన పెట్టుబడులు ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న చేసిన 14 ప్రారంభోత్సవాల్లో 8 శ్రీ సిటీలోవి. ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం. జిందాల్ స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ కోసం నాలుగో కృష్ణున్ని తీసుకువచ్చారు. ఆ జిందాల్ వేరు. కృష్ణపట్నం జిందాల్ వేరు. వీళ్ళు రూ. 7,300 కోట్లతో కృష్ణపట్నం దగ్గర స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పి రెండున్నరేళ్ల క్రితమే ఒక ఎంవోయూ చేశారు. అదే స్టీల్ ప్లాంటుని మరోసారి చూపించారు."- నాదెండ్ల మనోహర్