Rajahmundry News : వీపులో దిగిన ఇనుప రాడ్లు, క్లిష్టమైన ఆపరేషన్ చేసి బాధితుడి ప్రాణాలు నిలిపిన వైద్యులు
Rajahmundry News : ఇనుప రాడ్లు వీపులో, భుజంలో గుచ్చుకున్న ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలు నిలబెట్టారు వైద్యులు. రాజమండ్రికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అతి కిష్టమైన ఆపరేషన్ చేసిన బాధితులను రక్షించారు.
Rajahmundry News : శరీరంలో చిన్న సూది గుచ్చుకుంటేనే ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది 10 మిల్లీ మీటర్ల వ్యాసార్థం కలిగిన ఇనుప రాడ్లు వీపులో, భుజంలో గుచ్చుకుంటే ఆ బాధ వర్ణణాతీతం. తణుకుకు చెందిన భవన నిర్మాణ కార్మికులు షేక్ అరీఫ్, శ్రీనివాస్ శరీరాల్లోకి ఇనుప చువ్వలు చొచ్చుకుపోయాయి. ఇద్దరూ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో రాజమండ్రిలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మార్చి 20న జాయిన్ అయ్యారు. అరీఫ్ కు 33 అంగుళాలు, 29అంగుళాల పొడవు ఉన్న రెండు ఇనుప రాడ్లు వీపులో బలంగా చొచ్చుకుపోయాయి. ఒక ఇనుప రాడ్ వెనుకవైపు భుజానికి కాస్తంత కింద నుంచి శరీరంలోకి చొచ్చుకుపోయి, ఊపిరితిత్తులు, ఎడమ మూత్రపిండాన్ని గాయపరుస్తూ బయటకు వచ్చింది. రాజమండ్రిలోని సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకునే సరికే అరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక రెండో కార్మికుడు శ్రీనివాస్ కుడి చెయ్యిలోకి మూడు రాడ్లు చొచ్చుకుపోయాయి.
7 గంటలు పాటు ఆపరేషన్
ఈ సమాచారాన్ని అందుకున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ కె.విజయకుమార్, ఆసుపత్రికి చెందిన మిగిలిన అన్ని స్పెషాలిటీల వైద్య నిపుణులను అప్రమత్తం చేసి ఆసుపత్రికి రప్పించారు. వైద్యులు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరీఫ్, తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ ను ఆపరేషన్ థియేటర్ కు తరలించారు. అరీఫ్ శరీరంలోని రెండు పొడవైన రాడ్లను జాగ్రత్తగా తొలగించటానికి దాదాపు 7గంటలు పట్టింది. జనరల్ సర్జన్ డాక్టర్ నరేంద్ర, యూరాలజిస్ట్ డాక్టర్ హరికృష్ణ, కార్డియో థొరాసిక్ సర్జన్, ఎనస్థీషియా డాక్టర్ యశశ్వని, డాక్టర్ హర్షతో పాటు ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చివరకు అరీఫ్ ప్రాణాలను కాపాడగలిగారు. కుడి చెయ్యిలో మూడు రాడ్లు చొచ్చుపోయిన శ్రీనివాస్ కు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హేమసుందర్ ఆపరేషన్ చేసి మూడు రాడ్లను తొలగించారు.
(భవన నిర్మాణ కార్మికుడు అరీఫ్)
14 రోజుల పాటు వెంటిలేటర్ పై
ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్ అటు డాక్టర్లను, ఇటు వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయంచేస్తూ, బాధితుల ప్రాణాలను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. శ్రీనివాస్ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని మొదట్లోనే భావించామని, అయితే అరీఫ్ శరీరంలోని ముఖ్యమైన అవయవాలను గాయపరుస్తూ ఇనుపరాడ్లు చొచ్చుకుపోవటంతో, ఇతనిని ఎలాగైనా కాపాడాలని ఆసుపత్రి వైద్య నిపుణులంతా చాలా కష్టపడ్డారన్నారు. సర్జరీ తరువాత దాదాపు 14 రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందించామని, అయినప్పటికీ ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అరీఫ్ ప్రాణాలతో బయటపడ్డాడన్నారు. ఆదివారం అయినప్పటికీ తమ డాక్టర్లంతా సమాచారం అందుకున్న వెంటనే క్షణాల్లో హాస్పిటల్ కు చేరుకున్నారన్నారు. తమ డాక్టర్ల సమష్టి కృషి ఫలితంగానే అరిఫ్ ను కాపాడగలిగామని ఎండీ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. ఎలాంటి క్లిష్టమైన, కష్టమైన కేసులనైనా తమ ఆసుపత్రిలో వైద్య నిపుణులు చేయగలరని మరోసారి నిరూపించారన్నారు. బాధితుడు అరిఫ్ పీరాను డిశ్చార్జ్ చేసినట్టు చెప్పారు.
(గమనిక : ఈ కథనంలోని చిత్రాలు మిమల్ని కలచివేయవచ్చు)