Purandeswari: ఏపీ అప్పులు 2లక్షల కోట్లా? 10లక్షల కోట్లా? అసలు నిజాలు చెప్పిన పురంధేశ్వరి
తాను గతంలో ఒక ప్రెస్ మీట్‌లో ఏపీ అప్పుల గురించి చేసిన ఆరోపణలు, ఇప్పుడు కేంద్ర మంత్రి పార్లమెంటులో చెప్పిన లెక్కలు వేరుగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని పురంధేశ్వరి అన్నారు.
తాము చేసిన అప్పులకు, తప్పులకు జగన్ ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. నిన్న (జూలై 31) పార్లమెంటులో ఎంపీ రఘురామ ఏపీకి సంబంధించిన అప్పుల గురించి ప్రశ్న లేవనెత్తారని, దానికి నిర్మలా సీతారామన్ జవాబు ఇచ్చారని అన్నారు.
నిర్మల సమాధానం
టీడీపీ అధికారం కోల్పోయే సమయానికి ఏపీకి 2 లక్షల 64 వేల 451 కోట్ల అప్పు భారం ఉందని, క్రమేణా అప్పు భారం పెరిగిందని అన్నారు. అలా వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక 2023 నాటికి 4 లక్షల 41 వేల 472 కోట్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారని అన్నారు. ఈ మొత్తంలో నుంచి టీడీపీ హాయాంలో ఉన్న పాత అప్పును మినహాయిస్తే ప్రస్తుత ఏపీ అప్పులు లక్షా 77 వేల కోట్లే ఉంటుందని అన్నారు.
ఏపీకి రూ.10 లక్షల కోట్ల అప్పు
తాను గతంలో ఒక ప్రెస్ మీట్‌లో ఏపీ అప్పుల గురించి చేసిన ఆరోపణలు, ఇప్పుడు కేంద్ర మంత్రి పార్లమెంటులో చెప్పిన లెక్కలు వేరుగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఈనాటికి ఏపీపై మొత్తం ఉన్న అప్పు భారం రూ.10 లక్షల 77 వేల కోట్లు అని చెప్పానని అన్నారు. గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుడు 7 లక్షల కోట్లు ఉన్నాయని తాను ఆరోపించానని అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం చేసిన అప్పులను 10 లక్షల కోట్ల నుంచి మినహాయిస్తే ఏడు లక్షల కోట్ల పైచిలుకు అప్పును వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆ రోజు తాను విమర్శించానని అన్నారు.
నిర్మల సమాధానంపై పురంధేశ్వరి స్పష్టత
తాజాగా నిర్మలా సీతారామన్ జవాబు ఇస్తున్నప్పుడు కేవలం రిజర్వ్ బ్యాంకు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను మాత్రమే నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని పురంధేశ్వరి స్పష్టత ఇచ్చారు. అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు.. కార్పొరేషన్ల ద్వారా రూ.98 వేల కోట్లు, రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి రూ.98 వేల కోట్లు, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ.8 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ కార్పొరేషన్ ద్వారా రూ.పది వేల కోట్లు, డిస్కమ్ లకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.20 వేల కోట్లు, సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రూ.35 వేల కోట్లు, లిక్కర్ బాండ్ల ద్వారా రూ.8,375 కోట్లు, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.71 కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు రూ.33 వేల కోట్లు, ప్రభుత్వ సంస్థలు వేసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు వెనక్కు తీసుకున్నవి రూ.11 వేల కోట్లు, పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ నుంచి రూ.26 వేల కోట్లు, గ్రామ పంచాయతీలకు వచ్చిన వనరులు రూ.8,868 కోట్లు, జెన్ కో, ట్రాన్స్ కో ఉద్యోగుల పీఎఫ్ నుంచి రూ.3,600 కోట్లు, జీపీఎఫ్ ఫండ్స్ నుంచి రూ.17 వేల కోట్లు తీసుకున్నారని పురంధేశ్వరి వివరించారు.
అధికారికంగా రిజర్వ్ బ్యాంకు పరిధిలో తీసుకున్న అప్పులు రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఉంటే, అనధికారికంగా చేసిన అప్పులు మొత్తం కలిపి రూ.10.77 లక్షల కోట్లుగా ఏపీ అప్పులు ఉన్నాయని అన్నారు. తాను నిర్మలా సీతారామన్ కు ఏపీ అనధికార అప్పుల గురించి గత నాలుగైదు రోజుల క్రితమే రిప్రెసెంట్ ఇచ్చానని వివరించారు. నిన్న పార్లమెంటులో ఈ ప్రశ్నపై సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగి ఉంటే ఈ వివరాలు అన్నీ కూడా బయటకు వచ్చి ఉండేవని పురంధేశ్వరి వివరించారు.