Visakhapatnam: విశాఖ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, స్వాగతం పలికిన సీఎం జగన్
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్, సీఎం, అధికారులు ఘటన స్వాగతం పలికారు.
ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(President Ramnath Kovind) విశాఖ(Visakha)కు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వ భూషణ్, సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు. ఆదివారం విశాఖపట్నంలో నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగ(INS Dega)కు సాయంత్రం గంటలు 5.35 నిమిషాలకు ఆయన చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గవర్నర్(Governor) బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, శాసన సభాపతి తమ్మినేని సీతారాం, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తూర్పు నౌకాదళ కమాండ్, వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Governor of Andhra Pradesh, Shri Biswabhusan Harichandan and Chief Minister, Shri YS Jagan Mohan Reddy received President Ram Nath Kovind on his arrival at Visakhapatnam. The President will review the Naval Fleet tomorrow. pic.twitter.com/5hy6TR22X3
— President of India (@rashtrapatibhvn) February 20, 2022
విశాఖలో రేపట్నుంచి ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభకానుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, హెలికాప్టర్లు, కోస్టుగార్డ్, ఇతర నౌకలు కూడా ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటాయి. సుమారు 44 నౌకలు సముద్రంలో నాలుగు వరుసల్లో కొలువుదీరుతాయి. అలంకరించిన భారత గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి పయనిస్తూ గౌరవ వందనం స్వీకరిస్తారు. సుమారు 2 గంటల పాటు ఈ రివ్యూ కొనసాగుతోంది. నౌకాదళానికి చెందిన వాయుసేన సాహస విన్యాసాలు ప్రదర్శిస్తారు. మాధేయి, తరంగణి వంటి సెయిలింగ్ బోట్లు ప్రత్యేకతగా నిలుస్తాయి. గతేడాది నౌకాదళంలోకి ప్రవేశించిన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, హెలికాప్టర్లు, నిఘా విమానాలు ప్రత్యేక ప్రదర్శన చేస్తాయి. అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్, యద్ధనౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్నం కనిపించనున్నాయి.
రాష్ట్రపతి తన ఐదేళ్ల పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ చేస్తారు. ఇది 12వ సమీక్ష, విశాఖలో మూడోది. 2016లో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షను కూడా విశాఖలోనే నిర్వహించారు. నౌకాదళ సమీక్షకు రాష్ట్రపతి కోసం ఓ నౌకను ముస్తాబు చేస్తారు. అదే ఐఎన్‌ఎస్ సుమిత్ర. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో గోవాలోని షిప్‌యార్డులో ఈ నౌకను నిర్మించారు. ఈ నౌక 2014 సెప్టెంబరులో దళంలో చేరింది.