YSRCP: ప్రతిపక్ష హోదా కంటే ప్రజల గొంతే ముఖ్యం - వైసీపీ ప్రజలకేం చెబుతుంది?
AP Assembly: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అసెంబ్లీని బహిష్కరించడం, ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టడం .. ప్రజలిచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

YSRCP Chief Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుకాకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో సభను బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వమో లేదా స్పీకరో ఇచ్చే బహుమతి కాదు. అది నిబంధనల ప్రకారం దక్కాల్సిన గౌరవం. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఆ హోదా దక్కకపోయినా, ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవిస్తూ సభకు వెళ్లడం కనీస బాధ్యతగా కనిపిస్తుంది.
సంఖ్యాబలం కంటే సమస్యలే ప్రాధాన్యం
జగన్ మోహన్ రెడ్డి వాదన ప్రకారం, ప్రతిపక్ష హోదా లేకపోతే తమకు మాట్లాడటానికి తగినంత సమయం ఇవ్వరని, అది కేవలం ఒన్ సైడ్ షో లాగా సాగుతుందని భావిస్తున్నారు. అయితే, సమయం 2 నిమిషాలా లేక 20 నిమిషాలా అన్నది ముఖ్యం కాదు.. లభించిన ఆ కొద్ది సమయంలోనే ప్రజా సమస్యలను ఎంత బలంగా వినిపించారన్నదే ముఖ్యం. మండలిలో బలమున్న వైసీపీ, అసెంబ్లీలో మాత్రం ఎందుకు వెనుకాడుతోంది.. అన్న ప్రశ్న సామాన్య ఓటర్లలో తలెత్తుతోంది. సమస్యలను వీధి పోరాటాల ద్వారానే కాకుండా, చట్టసభ వేదికగా ఎండగట్టినప్పుడే పార్టీకి మైలేజీ పెరుగుతుంది.
ఎమ్మెల్యేల బాధ్యతను విస్మరించడమేనా?
ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి సభలో సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడం ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ, ఆయనతో పాటు ఎన్నికైన మిగిలిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? వారి నియోజకవర్గాల్లోని ప్రజలు తమ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తాయని ఆశపడతారు. జగన్ వెళ్లడానికి సిద్ధంగా లేకపోయినా, తన ఎమ్మెల్యేలను పంపి అధికార పక్షాన్ని నిలదీసేలా చేసి ఉంటే వైసీపీకి రాజకీయంగా గౌరవం దక్కేది. సభను పూర్తిగా వదిలేయడం వల్ల వైసీపీ బాధ్యత నుంచి తప్పుకుంటోంది అనే విమర్శలకు బలం చేకూరుతోంది.
వ్యూహం వికటించే ప్రమాదం ఉందా?
గతంలో 2017లో కూడా వైసీపీ ఇలాగే అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర కు వెళ్లింది. అప్పట్లో అది కొంత వర్కవుట్ అయినా, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు అధికార పక్షం బలంగా ఉంది, పైగా సోషల్ మీడియా యుగంలో అసెంబ్లీలో జరిగే ప్రతి చిన్న చర్చ ప్రజల్లోకి వెళ్తుంది. ఇలాంటి తరుణంలో గైర్హాజరు కావడం వల్ల, ప్రజా సమస్యలపై వైసీపీకి పట్టింపు లేదని అధికార కూటమి చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఇది పార్టీ క్యాడర్‌లో కూడా నైరాశ్యాన్ని నింపే ప్రమాదం ఉంది.
పోరాటం ద్వారా వచ్చే గుర్తింపే కీలకం
నిజానికి ప్రభుత్వాన్ని అడిగి ప్రతిపక్ష హోదా తీసుకోవడం కంటే, సభలో తమ పోరాటం ద్వారా ప్రభుత్వం తనంతట తానుగా గుర్తింపు ఇచ్చేలా చేయడం విపక్షానికి అసలైన గౌరవం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అని షరతులు పెట్టడం వల్ల వైసీపీ పరిస్థితి ప్రజల్లో చులకన అవుతోంది . జగన్ ఈ మొండి వైఖరిని వీడకపోతే, ప్రజలు తమ గొంతుకగా వైసీపీని గుర్తించడం కష్టతరం కావచ్చు.
ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది చర్చల వేదిక. ఆ వేదికను వదిలేయడం అంటే యుద్ధం చేయకుండానే వెనుదిరగడమే. జగన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని, ప్రతిపక్ష హోదా కోసం కోర్టుల్లో పోరాడుతూనే, మరోవైపు సభలో ప్రజల పక్షాన నిలబడితేనే వైసీపీ రాజకీయ ఉనికిని బలంగా చాటుకోగలదనేది రాజకీయ పండితుల అభిప్రాయం.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















