Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Andhra Pradesh News | పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, సైన్ బోర్డుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. కేంద్ర నిధులతో చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ తన ' x '' హ్యాండిల్ లో అధికారులకు సీరియస్ గానే క్లాస్ పీకారు.
"కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాల్ పెయింట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయని విషయం ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి వచ్చింది. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం, పంచాయతీరాజ్ శాఖ లోగో, ఉపాధి హామీ పథకం లోగో ఉండేలా చూడగలరు. ఖచ్చితంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యక్రమాల్లో ఈ ప్రోటోకాల్ పాటించాలి. అలాగే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం ఈ విషయంలో పర్యవేక్షణ చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు" అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
ప్రూఫ్ సరి చూసుకోరా?
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన హోర్డింగ్స్, వాల్ పోస్టర్స్ రెడీ చేసేటప్పుడు అధికారులు ఒకటికి నాలుగైదు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. యాడ్ రెడీ అయ్యాక సంబంధిత శాఖ కమీషనర్ లేదా డైరెక్టర్ ఓకే చేశాక మాత్రమే దాన్ని రిలీజ్ చేస్తారు. అలాంటిది ఇంత ముఖ్యమైన హోర్డింగ్స్ రిలీజ్ చేసేటప్పుడు ఏకంగా ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోవడం అనేది పెద్ద విషయమే. ఇది పొరపాటుగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే మోదీ ఫోటో లేపేసారా అనేది తెలియాల్సి ఉంది. పొరబాటున జరిగిన విషయమైతే పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.
గతంలోనూ ఇదే పొరపాటు
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారం లోకి వచ్చిన టీడీపీ, 2019 తర్వాత పవర్ చేపట్టిన వైసీపీ కూడా ఇదే పొరపాటు చేశాయి. కేంద్ర నిధులతో చేపట్టే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడం చాలా దారుణం అంటూ అప్పటి రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ లాంటివాళ్ళు విమర్శించేవారు. ఒకానొక దశలో బిజెపి, టీడీపీల మధ్య ఈ అంశమే విభేదాలకు కూడా కారణమైంది. ఏపీ అనే కాదు తెలంగాణ లోనూ ఇదే తంతు. తామిచ్చే నిధులతో చేపట్టే కార్యక్రమాలలో ప్రధాని ఫోటో ఎందుకు ఉండదంటూ ఏకంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేరుగా విమర్శలు గుప్పించిన సంఘటనలు గతంలో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఫేజ్ ముగిసిపోయిందనుకున్న దశలో మళ్లీ ఏపీ ప్రభుత్వ అధికారులు ఇలా కీలకమైన అంశాల్లో ప్రధాని మోడీ ఫోటో లేకుండా చేయడం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కోపం తెప్పించిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.