Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
ఆనం, కోటంరెడ్డి ఆరోపణలపై డీజీపీ బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు.
Pawan Kalyan On Anam : ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన చెందుతున్న డీజీపీ ఆయన భద్రతపై బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాలు , ట్యాపింగ్ వ్యవహారాలపై పవన్ తొలి సారి స్పందించారు. ఎమ్మెల్యేలే ప్రాణభయంతో వణికిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత లేకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ల ట్యాపింగ్ అంశాన్ని నేరుగా సీఎం.. ఆయన కార్యాలయంపైనే ఆరోపణలు చేశారన్నారు. సొంత ఎమ్మెల్యేలపై నిఘాలు, సంభాషణలు దొంగ చాటుగా వినడం.. అభద్రతా భావాన్ని చూపిస్తున్నాయని జగన్ పై మండిపడ్డారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా డీజీపీ, హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదని పవన్ ప్రశ్నించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై డీజీపీ స్పందించాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.
శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలి
— JanaSena Party (@JanaSenaParty) February 2, 2023
• శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/ZMW8c1TY75
వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నరగా తన ఫోన్ ట్యాప్ చేస్తోందని.. భద్రత తగ్గించారని ప్రాణభయం ఉందని ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఇలాంటి పోకడలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. స్థానికంగా ఉన్న అధికారులను మార్చడంతో పాటూ తన భద్రతను కూడా తగ్గించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయిస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నా తన సెక్యూరిటీని తగ్గించలేదని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ప్రమేయం లేకుండానే సెక్యూరిటీని తొలగించారని తెలిపారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాల్సి ఉందని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆధారాలు కూడా బయట పెట్టారు. ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు దేశద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని ట్యాప్ చేస్తారని, ప్రభుత్వ పెద్దలే ఫ్లోన్లు ట్యాపింగ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఆయన నేరుగా సీఎం జగన్, సజ్జల, సీఎంవో కార్యాలయంపైనే ఆరోపణలు చేశారు. అంతేకాదు 35మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీలు కూడా తనకు ఫోన్ చేశారని.. వాళ్ల ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని తనతో చెప్పినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని.. ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ ఈ అంశాలపైనే లేఖ రాశారు.