Pawan on CM Jagan: నువ్వొక సంస్కార హీనుడివి, సీఎం పదవికి తగవు - పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
తాడేపల్లి గూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
ఇంట్లో పిల్లల్ని చూసుకొనే గృహిణుల్ని సీఎం జగన్ నీచంగా మాట్లాడి బాగా దిగజారిపోయారని, సంస్కార హీనుడు అయిపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు. తాము ఎప్పుడూ సీఎం జగన్ సతీమణి భారతిని వివాదాల్లోకి లాగలేదని గుర్తు చేశారు. కానీ, జగన్ పదే పదే తన భార్య, తల్లిదండ్రుల గురించి ప్రస్తావింటున్నారని అన్నారు. జగన్ కు సంస్కారం లేదని, ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదని విమర్శించారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ‘‘నువ్వొక సంస్కార హీనుడివి జగన్.. వెళ్లి ఒకసారి భారతి మేడం గారిని అడుగు ఎప్పుడైనా ఆవిడని మేము దూషించామా అని’’ పవన్ కల్యాణ్ నిలదీశారు.
ముఖ్యమంత్రి మద్దతు దారులు తనను నీచంగా తిడుతున్నారని, తన ఇంట్లో ఆడవారిపైన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియా వారు కూడా మహిళల జోలికి రారని, జనసేన మహిళలను మాత్రం వైఎస్ఆర్ సీపీ నేతలు మాత్రం పదే పదే తిడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. తాను రాజకీయాల్లోకి ఎంతో ఇష్టంతో వచ్చానని అన్నారు. జగన్ మాదిరిగా తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, కానిస్టేబుల్ అని గుర్తు చేశారు. ఆయనకు వచ్చే డీఏలు, అలవెన్సులతోనే తాము సంతోషంగా బతికామని చెప్పారు.
తండ్రి చనిపోతే ఆ సందర్భాన్ని రాజకీయంగా అడ్డు పెట్టుకొని లబ్ధి పొందారని సీఎం జగన్ ను విమర్శించారు.