Paderu News: పోలీసులకు లొంగిపోయిన 34 మంది మిలీషియా సభ్యులు, ఓ మహిళా మావోయిస్ట్
Paderu News: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట 34 మంది మిలీషియా సభ్యులు, ఒక మావోయిస్టు సభ్యురాలు లొంగిపోయారు.
Paderu News: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట మహిళా మావోయిస్టు సభ్యురాలు భారతితో పాటు మరో 34 మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి పోలీసులు పెద్ద ఎత్తున డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సభ్యురాలు గెమ్మిళి భారతి అలియాస్ కిల్లో ఇందు పెద బయలు ఏరియా కమిటీకి చెందినవారు. ఈమె భర్త కిల్లో డోమన్న. అయితే మిలీషియా సభ్యులతో పాటు మావోయిస్టు దళ సభ్యురాలు భారతి లొంగిపోవడం గమనార్హం. భారతి ప్రధానంగా నాలుగు హత్యల్లో నిందితురాలిగా ఉన్నారు. జి.మాడుగుల మండలం మద్దిగారువులో కొలని సూర్య చంద్ర బాబు, ముక్కల కిషోర్ లను ఇన్ఫార్మర్లు అన్న నెపంతో హత్య చేసిన ఘటనలో ఈమె కూడా పాల్గొన్నారు. 2018 ఒరిస్సా లోని మల్కన్ గిరి జిల్లా, జొడోం బో పి.ఎస్. టికరపడ ప్రాంతం పోలీసులపై జరిగిన ఎదురు కాల్పుల్లో భారతి కూడా పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
దళ సభ్యురాలు భారతిపై లక్ష రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లొంగిపోయిన మిలీషియా సభ్యులకు పునరావాస చర్యలు చేపడతామన్నారు. ఇకపై మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు. అయితే వీరి వద్ద నుంచి బావుఫెంగ్ కంపెనీ 6 మ్యాన్ ప్యాక్ సెట్లు, 5 ఛార్జర్లు, కంట్రీమేడ్ ఎయిర్ పిస్టల్, ల్యాండ్ మెయిన్ ఒకటి, 5 కేలోల కార్తెక్స్, మూడు క్లైమూర్ మైనస్, 100 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భారతితో పాటు మిలిసియా సభ్యులు నేరుగా వచ్చి తమపై కేసులు ఉన్నాయని చెప్పి స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
నెలరోజుల క్రితమే లొంగిపోయిన రామోజు రాజేశ్వరి..
మహిళా మావోయిస్ట్ రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాల్ లక్ష్మి నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఆమె వయసు 59 సంవత్సరాలు. భర్త మరణం తర్వాత తీవ్ర కుంగుబాటుకి లోనైన రాజేశ్వరి పోలీసుల ముందు లొంగిపోయారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డుని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
అయితే రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాస్ లక్ష్మి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం దళంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. సీపీఐ ఎంఎల్, PWG (మావోయిస్టు), తూర్పు DVC తదితర దళాల్లో కూడా ఆమె పనిచేశారు. రాజేశ్వరిపై తూర్పు గోదావరి, ఏజన్సీ ఏరియాలో అడ్డ తీగల, గండవరం తదితర పోలీసు స్టేషన్ లలో 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2018 లో భర్త మరణంతో రాజేశ్వరి తీవ్ర కుంగుబాటుకు లోనైనట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు గతంలో పనిచేసిన చాలామంది ఇప్పటికే లొంగిపోయారు. వయసు రీత్యా, అనారోగ్య కారణాలతో ఆమె చివరకు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఎదుట లొంగిపోయారు. ఆమెపై రివార్డుగా ఉంచిన 4 లక్షల రూపాయల నగదుని ప్రభుత్వం ఆమెకే అప్పగించింది. చట్ట ప్రకారం ఇతర సౌకర్యాలను కూడా ఆమెకు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎస్పీ విజయరావు. రాజేశ్వరి లొంగిపోయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు.