Onion Price: పండుగకు ముందే సామాన్యులకు షాక్ - ఘాటెక్కిన ఉల్లి
Onion Price: టమాటాల ధరలు అదుపులోకి వచ్చి సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వినియోగదారులకు షాకిచ్చేందుకు ఉల్లి సిద్ధమైంది.
Onion Price: కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నెలన్నర క్రితం వరకు టమాటా రేట్లు చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. దాని తరువాత పచ్చి మర్చి ధరలు మండిపోయాయి. కొత్తిమీర వాసన కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. క్రమక్రమంగా ఒక్కొక్కటి దిగొచ్చిన తరుణంలో ఇప్పుడు షాక్ ఇవ్వడానికి ఉల్లి రెడీ అవుతోంది. టమాటాల ధరలు అదుపులోకి వచ్చి సామాన్య జనాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వినియోగదారులకు షాకిచ్చేందుకు ఉల్లి సిద్ధమైంది. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.45 నుంచి రూ.50 పలుకుతున్నాయి. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో సామాన్య ప్రజల బడ్జెట్‌కు గండిపడింది.
టమాటా ధరల పెరుగుదలతో ఇబ్బంది పడిన ప్రజలు తాజాగా ధరలు మళ్లీ పెరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నంలో కిలో ఉల్లిని రూ.50కి విక్రయిస్తున్నారు. రైతుబజార్‌లో కిలో ఉల్లి ధర రూ.40గా ఉంది. తిరుపతిలో రూ.40 వరకూ పలుకుతోంది. మార్కెట్‌లోకి కొత్త ఉల్లి ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైందని ఫలితంగా ఉల్లి దిగుబడిపై ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ధరలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు.
తగ్గిన దిగుబడి, దిగుమతులే దిక్కు
ఏపీలో ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. దీంతో వ్యాపారులు కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుంచి దిగుమతి చేసుకునేవారు. స్థానిక దిగుబడి, కర్ణాటక దిగుమతులు కలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సరిపడినంతా ఉల్లి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది. రాష్ట్రంలో ఉల్లి పంట లేకపోవడం, కర్ణాటకలోని రాణుల్, బళ్లారి నుంచి అవసరానికి సరిపడా ఉల్లి సరఫరాల లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లికి భారీ కొరత ఏర్పడింది. దీంతో వ్యాపారులు సైతం మహారాష్ట్ర నుంచి ఉల్లిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వర్షాభావ పరిస్థితులే కారణం
వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి సాగు దాదాపు 120 రోజులు ఆలస్యమైంది. దీంతో నవంబరు మొదటి వారం నుంచి కొత్త ఉల్లి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఉల్లి ధరలో కొంత తగ్గుదల ఉండవచ్చని తెలిపారు. అప్పటి వరకు ప్రజలపై భారం తప్పదని అభిప్రాయపడ్డారు. పండగ సీజన్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దసరాకు ముందుగానే ధరలు పెరగడంతో మధ్య తరగతి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నవంబర్లో కొత్త ఉల్లి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే వరకు ఉల్లి ధరల ఘాటును సామాన్యులు భరించడం తప్పేలా కనిపించడం లేదు.
ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు
గత ఆగస్టులో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. రంగంలోకి దిగిన కేంద్రం మార్కెట్‌లో ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై డిసెంబర్ 31 వరకు 40 శాతం సుంకం విధించింది. అలాగే వినియోగదారులకు ఉపశమనం కల్పించడానికి కిలో రూ.25 ధరకు విక్రయించాలని నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ప్రజలకు ఉల్లి అందించారు. తాజాగా ధరలు పెరుగుతుండంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరి రాయితీపై ఉల్లి అందించాలని కోరుతున్నారు.