Minister Vidadala Rajini : పొట్ట కూటి కోసం వచ్చిన కుటుంబానికి ఇలా జరగడం దురదృష్టకరం : మంత్రి విడదల రజిని
Minister Vidadala Rajini : రేపల్లె అత్యాచార బాధితురాలిని మంత్రి విడదల రజిని పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారని మంత్రి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Minister Vidadala Rajini : రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రేపల్లె ఘటన అత్యంత బాధాకరమన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబానికి ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించారన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. బాధ్యులపై చర్యల విషయంతో పాటు బాధితురాలి ఆరోగ్యంపై కూడా సీఎం ఆరా తీశారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు.
"సీఎం జగన్ ఇలాంటి ఘటనలను ఉపేక్షించరు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాం." అని మంత్రి తెలిపారు.
ముగ్గురు నిందితుల అరెస్టు
రేపల్లె రైల్వేస్టేషన్‌లో వివాహిత గ్యాంగ్ రేప్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ అత్యాచార కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువకులు కాగా, ఓ మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయకృష్ణ, నిఖిల్ అనే యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ నిందితుల అరెస్టు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 376(డీ), 394, 307, R/w 34 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని బాపట్ల ఎస్పీ స్పష్టం చేశారు. తమ పిల్లలతో భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్‌కు అర్ధరాత్రి చేరుకోగా, ఒంటిగంట సమయంలో అత్యాచార ఘటన జరిగింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కేసు దర్యాప్తు చేశామని, నిందితుడు చొక్కా మార్చుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్‌కు రాగానే పోలీసులు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ సామూహిక అత్యాచార కేసులో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు.
టైమ్ అడిగే వంకతో గొడవ
అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న బాధితురాలి భర్త వద్దకు నిందితులు వచ్చారు. టైమ్ అడిగి బాధితురాలి భర్తతో వివాదం పెట్టుకున్నారు. తనకు వాచీ లేదని చెప్పడంతో అతడిపై దాడిచేసి అతడి వద్ద నుంచి రూ.750 లాక్కున్నారు. అంతటితో ఆగని నిందితులు ఆ వ్యక్తి భార్యను జుట్టు పట్టుకుని ప్లాట్ ఫారమ్ చివరకు లాక్కెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె భర్తపై దాడి చేయడంతో అతడు స్థానికుల సాయంతో రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని తెలిపి, ఫిర్యాదు చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు జాగిలాలు, ఇతర ఆధారాల ద్వారా నిందితులను పోలీసులు ఆదివారం ఉదయం గుర్తించినట్లు వివరించారు.