AP Cinema Theaters: పవన్ ఆదేశాలు - రంగంలోకి అధికారులు - ధియేటర్లలో విస్తృత తనిఖీలు
Movie Theaters: పవన్ కల్యాణ్ ఆదేశాలతో సినిమా ధియేటర్లలో సౌకర్యాలపై అధికారులు సోదాలు ప్రారంభించారు. అన్ని విషయాలను క్షణ్ణంగా పరిశీలించి నివేదికలు సమర్పించనున్నారు.

Facilities in movie theaters: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి సోదాలు నిర్వహిస్తున్నాయి. థియేటర్లలో తీసుకుంటున్న సేఫ్టీ మేజర్స్, సరైన సదుపాయాలు లేని థియేటర్స్ వివరాల సేకరిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఆర్డీవో, తహసీల్దార్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు.
అంతకు ముందు పవన్ కల్యాణ్ ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణ అంశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. థి యేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని.. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని పవన్ కల్యాణ్ అంతకు ముందు ప్రభుత్వ శాఖలకు సూచించారు. సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలని సూచించారు. ఇందులో బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.
పవన్ ఆదేశాలను దిల్ రాజు స్వాగతించారు. సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడం అనే అంశం మీద పవన్ కళ్యాణ్ ఆలోచనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని 'దిల్' రాజు తెలిపారు. సినిమా థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయమని, దానిని అందరూ స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగుదామని చిత్రసీమకు 'దిల్' రాజు సూచించారు.





















