Andhra News : సీఎం జగన్ పిటిషన్ కొట్టేసిన ఎన్ఐఏ కోర్టు - కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం
కోడికత్తితో దాడి కేసులో లోతైన దర్యాప్తు కోసం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు, నిందితుడి బెయిల్ పిటిషన్‌పై ఒకటో తేదీన విచారణ జరగనుంది.
Andhra News : కోడి కత్తి కేసులో కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. ఎన్ఐఏ అసలు కుట్రదారులెవరో తేల్చేందుకు విచారణ చేయలేదని అందుకే మరింత లోతుగా విచారణ చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సమయంలో ముఖ్యమంత్రి జగన్ తరపు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిందితుడు తరపున అయన న్యాయవాది అబ్దుల్ సలీం వాదించారు. ఈ కేసులో ఇన్ కెమెరా విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాది సుమారు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించారు. ఇంతకుముందే ఈ కేసులో తదుపరి విచారణ చేయాలని, జగన్‌కు కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇనకొల్లు వెంకటేశ్వర్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండింటిపైనా ఆయన వాదనలు వినిపించారు.
సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై తాము ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది విశాల్ గౌతమ్ కోర్టుకు నివేదించారు. ‘ఘటనపై దర్యాప్తు ముగిశాక, కేసు విచారణ ప్రారంభమైన దశలో హఠాత్తుగా మళ్లీ లోతైన దర్యాప్తు డిమాండ్ తీసుకురావడం సహేతుకం కాదని ఘటనకు సంబంధించి సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించామని వీటి ప్రకారం శ్రీనివాసరావు ఒక్కడే నిందితుడని తేలిందని కుట్ర కోణం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని ఆయన వాదించారు.
నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం సైతం లోతైన దర్యాప్తు కోసం వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దని కోరారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిందితుడు అయిదేళ్లుగా రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్నారన్నారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తే నిందితుడికి న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. సీఎం జగన్, ఎన్‌ఐఏ, నిందితుడి తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తీర్పును న్యాయమూర్తి ఏ.సత్యానంద్ వాయిదా వేశారు. ఆ తీర్పును నేడు ప్రకటించారు.
విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ సైతం బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపైన ఆగస్టు 1న విచారణ చేపట్టనున్నట్లు ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది.