Vyuham Movie News: ఆర్జీవీ ‘వ్యూహం’తో వైసీపీ ఎమ్మెల్యేలకు తిప్పలు, ఈ ఒత్తిడి మామూలుగా లేదుగా!
Vyooham Movie: వ్యూహంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కొచ్చి పడింది. సినిమాని వారి వారి ప్రాంతాల్లో ఉచితంగా ప్రదర్శించాల్సిన అగత్యం వారికి ఏర్పడింది.
YSRCP News: రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదలైంది. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో వారి అనుకూల హ్యాండిళ్లు మాత్రం సినిమాని ఆకాశానికెత్తేశాయి. కానీ వాస్తవంలో వర్మ సినిమాలు ఇప్పుడెలా ఉంటున్నాయో అందరికీ తెలుసు. పార్టీ పేరు వాడుకోకుండా, వైరి వర్గంపై ఇష్టం వచ్చినట్టు సెటైర్లు వేయకుండా తీసిన యాత్ర-2 కూడా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇక వ్యూహం సంగతి వేరే చెప్పక్కర్లేదు, పూర్తి స్థాయిలో సెటైరిక్ గా తెరకెక్కిన వ్యూహం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది కానీ.. ఆ స్థాయిలో జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయిందనే వాదన ఉంది. అయితే ఈ వ్యూహంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కొచ్చి పడింది. సినిమాని వారి వారి ప్రాంతాల్లో ఉచితంగా ప్రదర్శించాల్సిన అగత్యం వారికి ఏర్పడింది.
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
వ్యూహం సినిమాకు టీడీపీ బ్యాచ్ ఎలాగూ రాదు. పోనీ వైసీపీలో అభిమానులెవరైనా టికెట్ కొనుక్కుని చూస్తారా అంటే.. వర్మ క్వాలిటీ తెలిసిన వారికి అంత ఆసక్తి ఉంటుందని అనుకోలేం. అందుకే ఇప్పుడీ సినిమాని ఉచిత ప్రదర్శనగా థియేటర్లలో వేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ థియేటర్లో వ్యూహం సినిమాని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉచిత ప్రదర్శన జరగనుండటం ఇక్కడ విశేషం. అధిష్టానం ఆదేశించిందో లేక ఎమ్మెల్యే అత్యుత్సాహమో తెలియదు కానీ.. వ్యూహానికి ఓ రేంజ్ లో బాకాలూదాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఉచిత ప్రదర్శనకు తానే రిబ్బన్ కటింగ్ చేయబోతున్నారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. ఈ ఉచిత ప్రదర్శనకు ఎమ్మెల్యే హాజరవుతున్నారంటూ ఆయన కార్యాలయం నుంచే ప్రకటన విడుదల కావడం విశేషం. ఎమ్మెల్యేనే నేరుగా వస్తున్నారంటే ఇక సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ రావడం ఖాయం. అది కూడా ఉచితంగానే. ఉచితంగా ప్రదర్శించే ఈ సినిమాకు ఎమ్మెల్యే ఉచిత పబ్లిసిటీ ఇస్తున్నారనమాట.
టీడీపీ విమర్శలు..
ఈ ఉచిత సినిమా వ్యవహారంపై టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే ఇలా ఉచిత సినిమాలు ప్రదర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఉచిత ప్రదర్శనకు పరిమితమైతే పర్లేదు, తానే స్వయంగా వచ్చి ఆ ప్రదర్శనకు పబ్లిసిటీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. సినిమా ఫ్లాప్ కావడం వల్లే ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు హైప్ తేవాలని చూస్తున్నారని కౌంటర్లిస్తున్నారు.
మొత్తమ్మీద వ్యూహం సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా వార్తల్లో నిలవడం విశేషం. సినిమా విడుదలకు ముందు నారా లోకేష్ కోర్టులో కేసు వేశారు. చివరకు ఆ అడ్డంకులన్నీ తొలగించుకుని వ్యూహం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాత్ర-2కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్.. వ్యూహంకి రాలేదనే ప్రచారం కూడా ఉంది. ఈ దశలో ఉచిత సినిమా అంటూ వైసీపీ నేతలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి నానా పాట్లు పడుతున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే ఈ ఉచిత సినిమాకు పబ్లిసిటీ ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. మరి ఎమ్మెల్యే ఆదేశించాక వైసీపీ శ్రేణులు ఈ సినిమాని హౌస్ ఫుల్ చేస్తాయో లేదో చూడాలి.