వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్-జలదీక్ష భగ్నం
వైసీపీ పెద్దల సూచనతోనే తనను అరెస్ట్ చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన హౌస్ అరెస్ట్ ను సోదరుడు, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి కూడా ఖండించారు. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు
అనుకున్నంతా అయింది, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డిని నెల్లూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన జలదీక్షపై ముందునుంచీ అనుమానాలున్నాయి. పోలీసులు జలదీక్షకు అనుమతి ఇవ్వలేదు, ఆయన మాత్రం చేస్తానంటున్నారు. ఈ దశలో అసలు దీక్ష జరుగుతుందా లేదా అని అనుకున్నారంతా. చివరకు పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను ఇల్లు కదలనివ్వలేదు. దీంతో నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఈరోజు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్ష చేపట్టాల్సి ఉంది. దీనికోసం ముందుగానే ఏర్పాట్లు జరిగాయి. అయితే పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. రద్దీ రూట్ లో జలదీక్ష చేపడితే ట్రాఫిక్ కి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో వారు అనుమతివ్వలేదని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం జలదీక్ష చేయాల్సిందేనన్నారు. దీనికోసం ఈరోజు ఉదయం సమాయత్తమవుతుండగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ పెద్దల సూచనతోనే తనను అరెస్ట్ చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన హౌస్ అరెస్ట్ ను సోదరుడు, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి కూడా ఖండించారు. కోటంరెడ్డి ఇల్లు, ఆఫీస్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు..
వైసీపీకి దూరం జరిగిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాచరణ ప్రకటించారు. నెల్లూరులో బారాషహీద్ దర్గా అభివృద్ధి పనులకోసం ముస్లింలతో కలసి ఆందోళన చేపట్టాలనుకున్నారు, కలెక్టరేట్ వద్ద నిరసన కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు రూరల్ లో రోడ్ల సమస్యలు, బ్రిడ్జ్ సమస్యల పరిష్కారం కోసం ఆర్ అండ్ బి ఆఫీస్ ముందు ధర్నా చేస్తానన్నారు. కానీ ఇవేవీ జరగలేదు. పోలీసులు అన్నిటినీ అడ్డుకున్నారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని చెప్పారు. దీంతో ఆయన ఆ నిరసన కార్యక్రమాలన్నిటినీ తన ఆఫీస్ లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఆఫీస్ ప్రాంగణంలోనే కూర్చుని దీక్షలు చేసేవారు. ఈరోజు జలదీక్ష మాత్రం పొట్టేపాలెం కలుజు వద్ద చేపడతానన్నారు. ఏళ్ల తరబడి అక్కడ బ్రిడ్జ్ హామీ అలాగే ఉండిపోయిందని, వైసీపీ అధికారంలోకి వచ్చినా పనులు చేయించలేకపోయామని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసేవారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
వాస్తవానికి పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జ్ లేకపోవడంతో నీటి ప్రవాహం నుంచే వాహనాలు వెళ్తుండేవి. పలుమార్లు అక్కడ ప్రమాదాలు కూడా జరిగాయి. దీంతో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ వినపిస్తుోంది. వర్షాకాలంలో అక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. దీంతో బ్రిడ్జ్ కోసం రూరల్ ఎమ్మెల్యే పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీలో అభివృద్ధి పనులు జరగడంలేదని ఆవేదన చెందారు. ఇప్పుడు పార్టీనుంచి దూరం జరిగి, పార్టీ కూడా సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా తన పోరాటాలను కొనసాగిస్తానంటున్నారు. కానీ కోటంరెడ్డి పోరాటాలు వాస్తవరూపం దాల్చేలా కనిపించడంలేదు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పెద్ద సీన్ క్రియేట్ అయింది.