వాలంటీర్లతో వైసీపీ లీడర్ల రహస్య సమావేశం-నెల్లూరులో పొలిటికల్ హీట్
వాలంటీర్ల సమావేశం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో స్థానిక అధికారులు కూడా హడావిడి పడుతున్నారు.
వాలంటీర్లను ఎన్నికల విధులకు, ఎన్నికల కోసం చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని హైకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా.. ఇంకా కొన్ని చోట్ల వారితో అవే పనులు చేయిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా సంగంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పక్కా ఆధారాలతో కలెక్టర్‌ని కలిశారు టీడీపీ నేతలు. ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు.
కృష్ణాష్టమి సెలవురోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో వైసీపీ నాయకులు స్థానిక వాలంటీర్లను ప్రాథమిక పరపతి సహకార సంఘం భవనంలో సమావేశపరిచారు. ఇక్కడ అధికారులెవరూ లేరు. కేవలం వాలంటీర్లు, వైసీపీ నాయకులు మాత్రమే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నేరుగా ఆ సమావేశం వద్దకు వెళ్లి నిలదీశారు. వాలంటీర్లతో వైసీపీ నాయకులు ఎందుకు సమావేశం పెట్టారన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల వివరాలు తీసుకుని వారి ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఆనం. ఆయన నిలదీసిన తర్వాత వాలంటీర్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైసీపీ నాయకులు కూడా కవర్ చేసుకోలేక తంటాలు పడ్డారు. ఈ ఘటన అంతా ఫొటోలు, వీడియోలు తీసిన టీడీపీ నాయకులు ఈరోజు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని చెప్పారు.
ఎందుకీ సమావేశం..?
వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి పారితోషికం ఇస్తూ, వారిని వైసీపీ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారనే అపవాదు చాన్నాళ్లుగా వినపడుతోంది. అందుకే కొత్తగా గృహసారథులను రంగంలోగి దించింది వైసీపీ. కానీ వాలంటీర్ల వద్ద ఉన్న సమాచారంతో ఇప్పుడు నాయకులకు అవసరం వచ్చింది. అందుకే వారితో రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల వివరాలు తీసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. సంగం మండల కేంద్రంలో కూడా ఇదే జరిగిందని, వాలంటీర్ల వద్ద.. ప్రజలు ఏయే పార్టీలకు అనుకూలంగా ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నవారు, వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే వారికి పథకాలు కట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా ఉండేవారి ఓట్లు తొలగిస్తున్నారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆనం ఆగ్రహం..
ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, వచ్చే దఫా ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన, ఆత్మకూరు నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెంచారు. ఆత్మకూరులో వైసీపీ నేతలు చేపట్టే కార్యక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణాష్టమి సెలవు రోజు సంగంలో నేతలు, వాలంటీర్లతో సమావేశమవుతున్నారని తెలుసుకుని నేరుగా ఆనం, ఆ సమావేశానికి వెళ్లారు. అక్కడ నేతల్ని నిలదీశారు. అసలు వాలంటీర్ల సమావేంలో అధికారులెవరూ ఎందుకు లేరని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు ఆనం.
వాలంటీర్ల సమావేశం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. టీడీపీ అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది. దీంతో స్థానిక అధికారులు కూడా హడావిడి పడుతున్నారు. వాలంటీర్లపై కూడా ఓ దశలో ఒత్తిడి ఎక్కువవుతోందనే చెప్పాలి. పథకాలు, లబ్ధిదారుల వివరాలు వారి దగ్గర వైసీపీ నేతలు సేకరిస్తున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే వాటిని దుర్వినియోగం చేస్తే మాత్రం ఎన్నికల ఫలితాలపై కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.