నెల్లూరులో ఇదేం ఖర్మ-ఆ ఎమ్మెల్యే కమల్ హాసన్ కంటే గొప్ప నటుడా?
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాయకులు ఇదేం ఖర్మ అంటూ రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గ్రామాల్లో చేరికలను ప్రోత్సహించారు.
ఈమధ్య నెల్లూరు జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం జోరుగా సాగింది. ఆ తర్వాత అధిష్టానం సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం మొదలు పెట్టారు. ముందుగా జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాయకులు ఇదేం ఖర్మ అంటూ రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గ్రామాల్లో చేరికలను ప్రోత్సహించారు.
ఆ ఎమ్మెల్యే ముందు కమల్ హాసన్ కూడా దిగదుడుపే..
వైసీపీలో కరకట్ట కమల్ హాసన్ అని ఓ ఎమ్మెల్యేకి పేరు. ఆయన మీడియా ముందు భలే నటిస్తారని, రకరకాల స్టిల్స్ తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారనే ప్రచారం ఉంది. తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యేని టీడీపీ ఇలాగే విమర్శిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు హీరో కమల్ హాసన్ కూడా పనికి రారని అంటున్నారు రూరల్ టీడీపీ నేతలు. శ్రీధర్ రెడ్డి నటనకు ఆస్కార్ అవార్డు ఇప్పించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.
రూరల్ ఎమ్మెల్యే ఇటీవల గడప గడప కార్యక్రమంతో జనంలోకి దూసుకెళ్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలను కూడా డెడ్ లైన్ పెట్ట మరీ పూర్తి చేస్తున్నారు. అయితే ఇదంతా నటన అంటూ టీడీపీ విమర్శిస్తోంది. చేసిన పనుల్నే మళ్లీ మళ్లీ చేస్తున్నారని, గతంలో తాము పూర్తి చేసిన వాటికి మెరుగులద్దుతున్నారని. కొత్తగా నిధులు విడుదల కావడం అంతా బోగస్ అనేది టీడీపీ ఆరోపణ. అయితే నెల్లూరు రూరల్ లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోరుగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. గడప గడప అనే కాన్సెప్ట్ కంటే ముందే ఆయన ప్రతి ఇంటి తలుపు తట్టే కార్యక్రమాలు మొదలు పెట్టారు.
టీడీపీ మాత్రం రూరల్ లో ఎమ్మెల్యే నటన హైలెట్ అంటూ సెటైర్లు పేలుస్తోంది. తాజాగా ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ టీడీపీ నేతలు సౌత్ మోపూర్ గ్రామంలోని రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులకు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఇదేం కర్మ ఫార్మ్ ను నింపారు. గ్రామస్తుల మొబైల్ నెంబర్లనుంచి 92612 92612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించి ఇదేం కర్మ పోరాటంలో భాగస్వాములను చేశారు. అనంతరం వారితో సెల్ఫీ దిగారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్ సీఎం అయిన తర్వాత మన రాష్ట్రానికి పట్టిన ఖర్మను గురించి వివరించడమేనన్నారు టీడీపీ నాయకులు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, చెప్పేది ఒకటి చేసేది ఒకటని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు టీడీపీ నేతలు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని పోలీసువారికి మనం బాధలు చెప్పుకునే పరిస్థితిలో లేమని మనకి అన్యాయం జరిగిందని చెబితే మనపైనే కేసులు పెడుతున్నారని అన్నారు టీడీపీ నేతలు. రైతులకు నీరు పుష్కలంగా ఉన్న పంటలు వేసే పరిస్థితి లేదని, గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయని విమర్శించారు. జగన్ పాలన అంతా ఓ కనికట్టు అని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాటిని తగ్గించాలని ఆలోచన జగన్ కి లేకపోవడం బాధాకరం అని చెప్పారు. రూరల్ నియోజకవర్గం లో ఎవరు వ్యాపారం చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా ఆఖరికి ఎవరైనా పెళ్లిళ్లు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేకి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు టీడీపీ నేతలు.
వైసీపీ నాయకుల వల్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, వారి కష్టాల్లో బాధల్లో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నాయకులు.