యర్రగొండుపాలెం ఘటనపై టీడీపీ సీరియస్- కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలోనే రాళ్ల దాడి జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనే స్వయంగా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి టీడీపీ అధినేతపైకి ఉసిగొల్పారని విమర్శిస్తున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన ఘటనలపై తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్‌గా చూస్తోంది. ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్న వ్యక్తిపై రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఆ పార్టీ... ఫిర్యాదు చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గవర్నర్‌తోపాటు ఇతరులకు ఫిర్యాదు చేయాలని దీనిపై అభిప్రాయ సేకరణ చేపట్టారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలోనే రాళ్ల దాడి జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనే స్వయంగా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి టీడీపీ అధినేతపైకి ఉసిగొల్పారని విమర్శిస్తున్నారు. ఈ దాడిలో కార్యకర్తలతోపాటు, చంద్రబాబు భద్రతా సిబ్బందికి కూడా గాయాలు అయినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను రాజ్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా వివరాలు పంపించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేరుగా నాయకులు కూడా వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అదే టైంలో కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.
ఈ ఘటనతోపాటు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన దాడులన్నింటినీ ప్రస్తావించనబోతున్నట్టు సమాచారం. గతంలో కూడా చాలా సార్లు చంద్రబాబుపై దాడికి యత్నించారని గుర్తు చేస్తున్నారు నాయకులు. వాటన్నింటినీ ఈ ఫిర్యాదులో పొందుపరిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అధినేతతోపాటు సామాన్యులపై కూడా జరుగుతున్న దాడులను వివరించనున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండుపాలెంలో రాత్రి హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఓవైపు చంద్రబాబు టూర్ అదే టైంలో ఆయనకు వ్యతిరేకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ నిరసన చేపట్టారు. ఈ రెండింటి మధ్య పోలీసులు, భద్రతా సిబ్బంది కాసేపు హడావుడి నడిచింది. ఓవైపు రాళ్లవర్షం మరోవైపు పోలీసులు లాఠీఛార్జ్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రకాశం జిల్లా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలతో ఆయన టూర్‌ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ సీన్‌లోకి రావడంతో ప్రశాంతంగా ఉన్న సిట్చుయేషన్ ఒక్కసారిగా వైల్డ్‌గా మారిపోయింది.
దళితులకు క్షమాపణ చేప్పిన తర్వాత తన నియోజకవర్గంలో పర్యటించాలని ఆదిమూలపు సురేష్ తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆదిమూలపు సురేష్ పిలుపుతో భారీగా పార్టీ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. నల్ల జెండాలు, బెలూన్లు పట్టుకొని టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా బ్లాక్ టీషర్టుతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సీన్ హీట్ పెంచారు.
మరోవైపు అదే రూట్‌లో వస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన వెంటనే భారీగా పార్టీ శ్రేణులు ఫాలో అయ్యారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ పోలీసుల్లో కనిపించింది. రోజుంతా కనిపించిన హైడ్రామా రాత్రికి మరింత వేడి పుట్టించింది.
ఉదయం నుంచి సాయంత్ర వరకు అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు చంద్రబాబు వచ్చే టైంలో కూడా నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌కు, ఆదిమూలపు సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగానే ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.