Chandrababu Satires: మా దరిద్రం నువ్వే జగన్, ‘మా నమ్మకం నువ్వే జగన్’పై చంద్రబాబు సెటైర్లు
ఇటీవల బహిరంగ సభల్లో పదే పదే జగన్.. మీ బిడ్డను ఆశీర్వదించండి, మీ బిడ్డకు అండగా నిలవండి అని పిలుపునిస్తున్నారు. అయితే మీ బిడ్డ పెద్ద క్యాన్సర్ గడ్డ అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.
ఏపీలో ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసీపీ కొత్త కార్యక్రమం మొదలు పెట్టింది. దానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే టైటిల్ మార్చారు. మా దరిద్రం నువ్వే జగన్ అని సెటైర్లు పేల్చారు. నెల్లూరులో టీడీపీ జోన్-4 మీటింగ్ లో పాల్గొన్న ఆయన జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మీ బిడ్డ క్యాన్సర్ గడ్డ..
జగన్ చెప్పే ప్రతి డైలాగ్ కి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. ఇటీవల బహిరంగ సభల్లో పదే పదే జగన్.. మీ బిడ్డను ఆశీర్వదించండి, మీ బిడ్డకు అండగా నిలవండి అని పిలుపునిస్తున్నారు. అయితే మీ బిడ్డ పెద్ద క్యాన్సర్ గడ్డ అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. క్యాన్సర్ గడ్డ శరీరంలో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసు కదా అని ప్రశ్నించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఏపీలో అరాచకం మొదలైందన్నారు చంద్రబాబు. ఆ తర్వాత వరుసగా అందర్నీ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పారు. అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదన్నారు. తాను చేసిన అభివృద్ధిని అక్కడే వదిలేసి.. రాష్ట్రాన్ని నిండా ముంచేశారని మండిపడ్డారు చంద్రబాబు.
నెల్లూరులో నేషనల్ హైవే సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి కాలేజీ గ్రౌండ్ లో జోన్-4 సదస్సు జరుగుతోంది. జోన్-4 పరిధిలోని ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు.. ఇందులో పాల్గొన్నారు.
కీలక నేతలంతా కలసి 2,500 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అనుకున్నా.. ఊహించినదానికంటే ఎక్కువగానే నేతలు అక్కడకు వచ్చారు. ముందుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సభా ప్రాంగణానికి చేరుకుని కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు సభా వేదిక వద్దకు వచ్చారు. చంద్రబాబు కూడా టెలిగ్రామ్ బాట్ ద్వారా అటెండెన్స్ తీసుకున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంశంపై జోనల్, పార్లమెంట్ వారీగా సమీక్షలు మొదలు పెట్టారు చంద్రబాబు.
సెల్ఫీ ఛాలెంజ్..
నెల్లూరులో మీటింగ్ కి హాజరయ్యేందుకు హైవేపై వచ్చిన చంద్రబాబు.. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లారు. టిడ్కో ఇళ్ల ముందు వాహన శ్రేణిని ఆపి అక్కడ సెల్ఫీ దిగారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో సీఎం జగన్‌కు సవాల్ చేశారు. ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలని.. మీ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఎక్కడ అని ప్రశ్నించారు చంద్రబాబు.
చూడు... @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2023
ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?#SelfieChallengeToJagan pic.twitter.com/1yoMGd4yf9
ఓవైపు నారా లోకేష్ పాదయాత్రతో రాష్ట్ర పర్యటన చేస్తుండగా.. మరోవైపు చంద్రబాబు పార్టీ నాయకులను కలిసేందుకు జోనల్ మీటింగ్ లు పెట్టుకున్నారు. జోనల్ మీటింగ్ లతో ఆయన అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తాజాగా జోన్-4 జిల్లాల్లోని నాయకులతో మీటింగ్ పెట్టారు చంద్రబాబు. గతంలో ఓసారి నెల్లూరు పర్యటన వాయిదా పడగా.. ఈరోజు జిల్లాలోనే జోన్-4 జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు.