నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ కి బలైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్
రుణ యాప్ ల బారిన పడి తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. లోన్ డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టి నష్టాలు రావడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం.. ఏపీలో ఇటీవల ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి. రుణ యాప్ ల బారిన పడి తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. రుణయాప్ ద్వారా లోన్ తీసుకుని, ఆ డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టి నష్టాలు రావడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో లోన్ యాప్ దారుణాలకు మరో వ్యక్తి బలయ్యాడు. మృతుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకుని అది షేర్లలో పెట్టి నష్టపోయినట్టు తెలుస్తోంది. మృతుడి పేరు నేలవల్లి హరినాయుడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని రాజగోపాలపురంకి చెందిన హరికృష్ణ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అప్పు తిరిగి తీర్చలేక, మరోవైపు లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేక రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఓ పాప ఉన్నారు. దొరవారిసత్రం మండలం నెలబల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన భార్యకు మెసేజ్ పెట్టాడు. తన చావుకి లోన్ యాప్ లే కారణం అన్నాడు.
ఆన్ లైన్ లో అప్పు తీసుకునేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే చివరకు పెద్ద తప్పులుగా మారతాయి. లోన్లు తీసుకునేటప్పుడు మన కాంటాక్ట్ నెంబర్లన్నిటినీ యాప్ వాడుకునే వెసులుబాటుని మనమే కల్పిస్తాం. మన మీడియా డ్రైవ్ లో ఉన్న ఫొటోల్ని కూడా వాడుకునే యాక్సెస్ ఇస్తాం. ఇలా మన కాంటాక్ట్స్ ని వాడుకుంటూ అప్పు తీర్చలేని పక్షంలో వారందరికీ మెసేజ్ లు పెడుతూ మన పరువు తీయడానికి ప్రయత్నిస్తాయి లోన్ యాప్స్. రికవరీ ఏజెంట్ల సూటిపోటి మాటలు, బ్లాక్ మెయిల్స్ కి భయపడి చాలామంది ఆత్మహత్యలబారిన పడుతున్నారు.
ఇటీవల ఓ యువదంపతులు కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనలో కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడగా.. అతని భార్య, కుమార్తె అనాథలుగా మిగిలారు. మంచి కుటుంబం, చక్కని జీతం.. అయినా కూడా అత్యాశతో లోన్ యాప్ లో వచ్చే సులభమైన అప్పుకోసం జీవితాన్నే బలిచేసుకున్నాడు హరికృష్ణ. లోన్ తీసుకున్న తర్వాత షేర్ మార్కెట్లో పెట్టడం అతను చేసిన మరో తప్పు. దీంతో అసలు పోయింది, దాన్ని తీర్చే మార్గం కనిపించలేదు. అటు లోన్ యాప్ నుంచి రికవరీపై ఒత్తిడి పెరిగింది. ఏంచేయాలో తెలియక చివరకు హరికృష్ణ ప్రాణం తీసుకున్నాడు.
లోన్ యాప్ ల విషయంలో ముందు ప్రజల్లో అవగాహన పెరగాలంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన పెంచుతున్నా లోన్ యాప్ ల వలలో పడిపోతున్నారు కొంతంది. ఆర్థిక క్రమశిక్షణ లేనివారే ఎక్కువగా ఇలాంటి సులభమైన అప్పులకు లొంగిపోతారని, ఆ తర్వాత వారు కట్టలేని పరిస్థితుల్లో అఘాయిత్యాలకు పాల్పడుతుంటారని చెబుతున్నారు నిపుణులు. లోన్ యాప్ వేధింపుల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నా, వారికి ధైర్యం చాలడంలేదు. చివరికిలా ప్రాణాలు వదిలేస్తున్నారు.