Heart Attack: పాఠాలు చెబుతూనే ఆగిన ఉపాధ్యాయుడి గుండె- హార్ట్ స్ట్రోక్‌కు మరొకరరు బలి!
Heart Attack: పని చేస్తూనే కుప్పకూలిపోతున్నారు. ఏళ్ల నిండక ముందే తనువు చాలిస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు కూడా పాఠాలు చెబుతూనే కుప్పకూలిపోయాడు
Heart Attack: సడెన్ హార్ట్ అటాక్‌లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. వారం వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న మరణాలు కంగారు పెట్టిస్తున్నారు. పని చేసుకుంటూనో.. జిమ్ చేస్తూనో.. పాఠాలు చెబుతూనే ప్రాణాలు గాల్లో కలిసి పోతుతన్నాయి. ఇందులో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఓ ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూనే మృతి చెందాడు. వాకావాకా వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఉదయం బడికి హుషారుగా వచ్చిన టీచర్ పాఠాలు చెబుతూనే గుండె ఆగిపోయింది. ఆయన కుర్చున్న చోటే కూలబడిపోయి కన్నుమూశారు.
వెంటనే స్పందించిన స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఉపాధ్యాయుడితోపాటు పాఠశాల ఉన్న ఊరిలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.
శుక్రవారం ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూపోయిన ఓ విద్యార్థి నిమిషాల వ్యవధిలో కన్నుమూశాడు. మేడ్చల్ లోని సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటివరకూ తోటి విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపాడు. కానీ కాలేజీ ఆవరణలో విద్యార్థి విశాల్ ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మార్గం మధ్యలోనే ఆ విద్యార్థి మృతి చెందాడు. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న రాజస్థాన్ కి చెందిన విద్యార్థి విశాల్ ఆకస్మిక మరణంతో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇటీవల హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే ఏపీలో అలాంటి ఘటనే జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వ్యాయామం చేసేందుకు జిమ్ కు వెళ్లాడు. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో అక్కడ కళ్లు తిరిగినట్లు అనిపించగా కొంత సమయానికే జిమ్ నుంచి బయటకు వచ్చేశాడు. అలా రాగానే ఆయనకు మూర్ఛ వచ్చింది. విషయం గుర్తించిన స్థానికులు సపర్యలు చేయగా.. స్పృహలోకి వచ్చాడు. ఈ క్రమంలో కార్డియాక్ అరెస్ట్ అయి కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.
ఫిబ్రవరి 23న పాత బస్తీలో ఓ పెళ్లి వేడుకలో వరుడిని రెడీ చేస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. కాలాపత్తార్‌లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పెళ్లి కొడుకు వద్దకు వచ్చి.. అతడి పాదాలకు పసుపు రాస్తుండగా ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలిపోయి మరణించాడు.
నిర్మల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ యువకుడు ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. నిమిషాల వ్యవధిలో అతడు చనిపోయాడు. ఆపై హైదరాబాద్ లోనూ మరో ఘటన జరిగింది. బ్యాడ్మింటన్ ఆడుతూ 38 ఏళ్ల ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో అతడు అక్కడిక్కడే చనిపోయిన ఘటన తెలిసిందే.
కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ పోలీస్
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇటీవల కాపాడటం తెలిసిందే. నడి రోడ్డుపైనే ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికాగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్సు దిగిన బాలాజీ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఆరంఘర్ చౌరస్తాలో దిగగానే బాలాజీ గుండెపోటుతో కుప్పకూలాడు. అతణ్ని గమనించి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే సీపీఆర్ చేశారు. ఛాతీపై గట్టిగా పదే పదే ప్రెస్ చేసి బాలాజీ ప్రాణాన్ని రాజశేఖర్ కాపాడారు. అనంతరం బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.