నెల్లూరులో రాజకీయ దాడులు- అధికార వైఎస్‌ఆర్‌సీపీలో కలకలం
విద్యార్థి నాయకుడు హాజీపై దాడిన ఖండించిన రూప్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడమే హాజీ చేసిన తప్పా అని ప్రశ్నించారాయన.
నెల్లూరులో రాజకీయ దాడులు కలకలం రేపాయి. ఇటీవల నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్.. వైరి వర్గాలుగా మారిన విషయం తెలిసిందే. స్వయానా సీఎం జగన్ సయోధ్య కుదిర్చినా ఆ విషయంలో రాజీ కుదరలేదు. ఈ నేపథ్యంలో రూప్ కుమార్ యాదవ్ వర్గానికి చెందిన మైనార్టీ నాయకుడిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ విద్యార్థి విభాగం నేత హాజీపై దాడి చేశారు. హాజీని వెంటనే నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
హాజీని పరామర్శించేందుకు వచ్చిన రూప్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. దాడిని తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడమే హాజీ చేసిన తప్పా అని ప్రశ్నించారాయన. నెల్లూరులో రాజకీయ దాడుల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
ఆధిపత్య పోరు మొదలైందా..?
ఆమధ్య నెల్లూరు బారాషహీద్ దర్గా ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే అనుచరుడిపై జరిగిన దాడిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా ఉండే నెల్లూరులో అధికార పార్టీలోనే ఆధిపత్యపోరు మొదలైందనే విషయం అప్పట్లోనే బయటపడింది. అంతకు ముందునుంచి ఈ ఆధిపత్యపోరు ఉన్నా కూడా.. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ పక్కనపెట్టడంతో వారి మధ్య స్పష్టమైన విభేదాలొచ్చాయి.
నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలో వైసీపీ వర్గాలు రెండుగా విడిపోయాయి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గం వైసీపీనుంచి బయటకు రాగా.. మిగతావారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డివైపు వచ్చారు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ తర్వాత నెల్లూరు కార్పొరేషన్లో మేయర్ పొట్లూరు స్రవంతిని అడ్డుకోడానికి కొంతమంది నేతలు ప్రయత్నించారు. కార్పొరేషన్లో ఫైటింగ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇక సిటీ నియోజకవర్గం విషయానికొస్తే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కి మధ్య గొడవలున్నాయి. పార్టీ పెద్దలు ఎన్నిసార్లు జోక్యం చేసుకున్నా అవి పరిష్కారం కావడంలేదు. సాక్షాత్తూ సీఎం జగన్ వారిద్దరి చేతులు కలిపినా కూడా ఫలితం లేదు. తాను అలాంటివారితో కలిసేది లేదని తేల్చి చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలో రూప్ కుమార్ యాదవ్ అనుచరుడిపై దాడి సంచలనంగా మారింది. ప్రస్తుతానికి దాడి చేసినవారెవరనేది తేలలేదు. రూప్ వర్గం కూడా ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదు. పోలీసులకు కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. అధికార పార్టీలోనే ఒకరిపై ఒకరు నిందలేసుకోవడంతో నెల్లూరు పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు.
ఎన్నికలనాటికి ఎలా ఉంటుందో..?
నెల్లూరులో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, ఇక ఎన్నికలనాటికి వ్యవహారం ఎలా ఉంటుందో అనే అనుమానాలున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు వైసీపీ గెలుచుకుంది, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మూడు చోట్ల ఎమ్మెల్యేలను పార్టీయే బయటకు పంపించింది. మిగతా చోట్ల కూడా అసంతృప్తి రగులుతోంది. వారిలో కొంతమందికి టికెట్లు ఇవ్వరనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆశావహులు జగన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో ఆధిపత్యపోరు ఎలా ఉంటుందో అనే అనుమానాలున్నాయి.