పెళ్లిళ్ల బాబాకు వ్యతిరేకంగా నెల్లూరులో 13 కేసులు- రోడ్డెక్కిన మహిళలు!
ఆదర్శవంతంగా ఉండాల్సిన వ్యక్తి హఫీజ్ పాషా.. దర్గా పవిత్రతను అపవిత్రం చేశాడని, వెంటనే అతడిని దర్గా పీఠాధిపతి పదవి నుంచి తొలగించాలన్నారు నెల్లూరు జిల్లా మహిళా సంఘాల నేతలు.
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గాకు చెందిన హఫీజ్ పాషా అలియాస్ పెళ్లిళ్ల బాబా గుట్టు రట్టయింది. ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు చేసుకుని, ఎనిమిదో పెళ్లికి రెడీ అవుతుండగా హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏఎస్ పేట మహిళా నాయకులు దర్గా వద్ద ఆందోళన చేపట్టారు. ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆదర్శవంతంగా ఉండాల్సిన పదవిలో ఉన్న హఫీజ్ పాషా.. దర్గా పవిత్రతను అపవిత్రం చేశాడని, వెంటనే అతడిని దర్గా పీఠాధిపతి పదవినుంచి తొలగించాలన్నారు. అతడిపై జిల్లా ఎస్పీకి, వక్ఫ్ బోర్డ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు మహిళలు.
ఏం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో ని దర్గా పీఠాధిపతి హఫీజ్ పాషా.. దర్గా సమీపంలోని మహల్ లో కుటుంబంతో కలసి నివశిస్తుండేవాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దర్గాకు భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడేవారిని ఇక్కడికి తెస్తుంటారు. ఇక్కడే వారిని ఉంచి వారి సమస్య నయమైన తర్వాత తిరిగి తీసుకెళ్తుంటారు కుటుంబ సభ్యులు ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏఎస్ పేట వచ్చింది. ఆ కుటుంబంలో ఓ యువతి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుండే సరికి వారు ఆమెను ఏఎస్ పేట దర్గాకు తెచ్చారు. గతంలో పలుచోట్ల ఆమెను తీసుకెళ్లినా ఫలితం లేకపోయే సరికి చివరకు ఏఎస్ పేట దర్గాకు తెచ్చారు.
ఆ యువతి వాలకం, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి చూసిన హఫీజ్ పాషా వారిని పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పాడు. ఆమెకు దెయ్యం పట్టిందని, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులను నమ్మించాడు. మూడేళ్ల నుంచి చికిత్స తీసుకుంటున్నా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదని, దానికి కారణం ఆమెకు పట్టిన దెయ్యం వదిలి పోలేదని చెప్పాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తే దెయ్యం వదిలించే బాధ్యత తానే తీసుకుంటానన్నాడు. అంతే కాదు మరి కొన్ని రోజుల్లో ఆ అమ్మాయి చనిపోతుందని కుటుంబ సభ్యులను భయపెట్టాడు. దీంతో వారంతా ఆ అమ్మాయిని హఫీజ్ పాషాకి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ లో పెళ్లి వేదిక సిద్ధం చేశారు ముహూర్తం ఖరారు చేశారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల దగ్గర కొంత డబ్బు కూడా పాషా వసూలు చేసినట్టు తెలుస్తోంది.
ఈనెల 11న హైదరాబాద్ టోలిచౌక్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పాషాతో ఆ అమ్మాయికి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పాషా పెళ్లి మండపానికి రాకపోవడంతో బంధువులు ఆరా తీశారు. తనకు ఆరోగ్యం బాగోలేదన చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా అతని వాలకం అనుమానంగా ఉండటంతో చివరకు అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే హఫీజ్ పాషాకి ఏడు పెళ్లిళ్లు జరిగాయని, ఎనిమిదో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఈ వ్యవహారం బెడిసికొట్టిందని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటు నెల్లూరు జిల్లాలో కూడా హఫీజ్ పాషా వ్యవహారం రచ్చకెక్కింది. అతడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.