Nellore Tragedy: నెల్లూరులో విషాదం, పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు దుర్మరణం!
పిల్లలను కాపాడే క్రమంలో వారు గుంతల్లో మునిగిపోయారు. పిల్లలిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారనే వార్త సంతోషాన్నిచ్చినా, వారి తల్లులు అవే గుంతల్లో మునిగి ప్రాణాలొదిలారు. చివరికి వారి మృతదేహాలను వెలికితీశారు.
నెల్లూరు నగర పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి గుంతల్లో పడిన ఇద్దరు పిల్లలను కాపాడి, వారి తల్లులు ప్రాణాలొదిలారు. వేసవి సెలవలు కావడంతో భగత్ సింగ్ నగర్ కాలనీలోని పిల్లలు పక్కనే ఉన్న పెన్నాలో ఈతకు వెళ్తున్నారు. అయితే ఇటీవల ఇక్కడ పెన్నా నదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. దీనికోసం గుంతలు తవ్వారు. ఈ గుంతల్లో ఈతకోసం వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, విషయం తెలిసిన వారి తల్లులు వెంటనే అక్కడికి వచ్చారు. పిల్లలకోసం ఆ గుంతల్లో దూకారు. పిల్లలిద్దర్నీ జాగ్రత్తగా ఒడ్డుకి చేర్చారు. అయితే ఆ తర్వాత ఆ ఇసుక గుంతల్లోనుంచి బయటకు రావడం వారికి సాధ్యం కాలేదు. ఊబిలాగా ఉండటంతో క్రమక్రమంగా ఆ ఇసుకలోకే ఒరిగిపోయారు. పిల్లలకోసం వెళ్లిన తల్లులు ప్రాణాలొదిలారు.
పెన్నాకు ఎప్పుడు వరదలొచ్చినా నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ మునిగిపోతుంది. ఆమధ్య పెన్నాకు భారీ వరదల కారణంగా భగత్ సింగ్ కాలనీ సగానికి పైగా నీళ్లు వచ్చాయి. ఎక్కడివారక్కడ తట్టాబుట్టా సర్దుకుని వలస వెళ్లారు. తిరిగి నీరు తగ్గగానే అదే ప్రాంతానికి వచ్చారు. వారందరికీ పునరావాసం కల్పిస్తామని సీఎం జగన్ స్వయానా హామీ ఇచ్చారు. ఆయన కూడా భగత్ సింగ్ కాలనీకి వచ్చి వారిని పరామర్శించారు. జగన్ పర్యటనలో స్థానిక మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఆయనే జలవనరుల శాఖ మంత్రి కావడం, పెన్నా వరద ప్రాంతం నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో చకచకా ఫైల్స్ కదిలాయి. రిటైనింగ్ వాల్ విషయంలో సీఎం జగన్ కూడా స్థానికులకు హామీ ఇవ్వడంతో ఆ తర్వాత పనులు మొదలయ్యాయి. కానీ అవి నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకూ పనుల్లో పురోగతి లేదు. ఇటీవల ఆ రిటైనింగ్ వాల్ కోసం గుంతలు తవ్వారు. కానీ వాటి వద్ద ప్రమాద సూచికలేవీ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని అంటున్నారు.
భగత్ సింగ్ నగర్ కి చెందిన షాహినా, షబీనా ఇరుగుపొరుగు వారే. వారి పిల్లలు పెన్నాలో ఈతకు వెళ్లారని, గుంతల్లో చిక్కుకుపోయారనే సమాచారంతో వెంటనే పరుగు పరుగున వారు అక్కడికి వచ్చారు. అయితే పిల్లలను కాపాడే క్రమంలో వారు గుంతల్లో మునిగిపోయారు. పిల్లలిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారనే వార్త సంతోషాన్నిచ్చినా, వారి తల్లులు మాత్రం అవే గుంతల్లో మునిగి ప్రాణాలొదిలారు. చివరికి వారి మృతదేహాలను వెలికితీశారు.
అనిల్ పై ఆరోపణలు..
ఈ విషయం తెలిసిన వెంటనే నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వామపక్షాల నేతలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భగత్ సింగ్ నగర్ లో బాధిత కుటుంబాలను వారు పరామర్శించారు. ఎమ్మెల్యే అనిల్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి అయ్యారని, అనిల్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు నెల్లూరు సిటీ టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. రక్షణ గోడ నిర్మాణ ప్రదేశంలో కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ వల్ల రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. బాధిత కుటుంబాలకు చెరో 50లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడప గడపకు భగత్ సింగ్ కాలనీకి వచ్చిన అనిల్.. మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణం అని విమర్శించారు టీడీపీ నేతలు. పొలిటికల్ మైలేజ్ కోసం పనులు స్టార్ట్ చేసి.. కనీసం సూచిక బోర్డులు కూడా పెట్టలేదన్నారు.