నాపై, నా కుటుంబంపై కుట్ర- సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే!
తనపై,తన కుటుంబంపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మండిపడ్డారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారని అన్నారు.
తనపై,తన కుటుంబంపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మండిపడ్డారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారని అన్నారు. సర్వేలన్నీ నెల్లూరు రూరల్ లో తనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు శ్రీధర్ రెడ్డి. దీనిని ఓర్చుకోలేక, తన కుటుంబంలో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. వారి రాజకీయ ఉచ్చులో పడొద్దని, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని వైసీపీ నేతలు, కార్యకర్తలకు రూరల్ ఎమ్మెల్యే సూచించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల జరిపిన అన్ని సర్వేల్లో ఫలితాలు తనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు శ్రీధర్ రెడ్డి. దీనిని ఓర్చుకోలేని కొంతమంది ప్రత్యర్థులు తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని దుర్భాషలాడుతూ, సోషల్ మీడియాలో విపరీతంగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్నారని, వీటిని చూసి ఎవరూ రెచ్చిపోకుండా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ఆశీస్సులే తనకు కొండంత అండని చెప్పారు. ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు భరించలేని స్థితికి చేరుకుంటే అప్పుడు న్యాయ పోరాటం చేద్దామన్నారు.
ఎవరి పని..?
అయితే రూరల్ ఎమ్మెల్యే టార్గెట్ ఎవరనేది తెలియలేదు. రాజకీయ ప్రత్యర్థులు అన్నారే కానీ, ఫలానా పార్టీ అని కానీ, ఫలానా వ్యక్తి అని కానీ ఆయన నేరుగా వేలెత్తి చూపించలేదు. అంటే సొంత పార్టీలో కూడా ఎవరైనా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారా అనే అనుమానం కూడా ఉంది. అయితే వారు ఎవరు అనే విషయాన్ని తాను చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన చోట చెబుతానన్నారు. అంటే రూరల్ ఎమ్మెల్యే ఎవరిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఇంకా తేలడంలేదు.
కామెంట్లు కూడా పెట్టొద్దు..
సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టింగులకి, కామెంట్లు కూడా పెట్టొద్దని నాయకులు, కార్యకర్తలకు సూచించారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఈ విషయంలో రెండు చేతులు జోడించి అభ్యర్ధిస్తున్నానని, అర్థం చేసుకోవాలన్నారు. తమని రాజకీయంగా ఎదుర్కోలేని వ్యక్తులు చేసే కుట్రల్ని, కుతంత్రాలని ఏ విధంగా ప్రజల అండతో ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని చెప్పారాయన. నిరంతరం ప్రజలలో ఉండి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం, అభివృద్ధి కార్యక్రమాల సాధన, సంక్షేమ పధకాల అందజేతమీద దృష్టిసారించాలని సూచించారు.
రూరల్ వైసీపీలో కలకలం..
ఉచ్చులో పడొద్దు, రెచ్చిపోవద్దు, పలుచన కావద్దంటూ రూరల్ ఎమ్మెల్యే సూచించినా, అసలు ఆయన్ను ఎవరు టార్గెట్ చేశారనే విషయమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి సీటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే అనుకున్నా, ఆయన గెలుపు ఖాయమని అనుకున్నా.. ఎన్నికలనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఏ పార్టీలో కూడా ఫలానా సీటు, ఫలానా వారికే అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అటు టీడీపీ కూడా దూకుడుగానే ఉంది. నెల్లూరు రూరల్ లో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ టీడీపీ తరపున బరిలో దిగబోతున్నారు. ఆయన కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు రూరల్ లో ఆనం వర్గం వైసీపీలోనే ఉన్నా, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో వారికి మాటలు లేవు. అటు ప్రత్యర్థి పార్టీని, ఇటు సొంత పార్టీలోని ప్రత్యర్థుల్ని కూడా కాచుకోవడం రూరల్ ఎమ్మెల్యే తక్షణ కర్తవ్యంగా మారింది.