Kotamreddy Brothers: ముందు తమ్ముడు, తర్వాతే అన్న - టీడీపీలో చేరనున్నMLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు!
ఈనెల 24న రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున చేరికల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి మరో అడుగు దగ్గరవుతున్నారు. ఈనెల 24న రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరు నుంచి కార్లతో ర్యాలీగా విజయవాడ వెళ్లి పార్టీ ఆఫీస్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరతారని అంటున్నారు. దీనిపై అటు టీడీపీ నుంచి కానీ, ఇటు కోటంరెడ్డి ఆఫీస్ నుంచి కానీ అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే మంతనాలు మాత్రం జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున చేరికల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ సత్తా ఇది అని చూపించేందుకు కోటంరెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారు.
ముందు తమ్ముడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరతారు, ఆ తర్వాత అన్న శ్రీధర్ రెడ్డి పార్టీకి దగ్గరవుతారు. ఇదీ ప్రస్తుతం ఉన్న ప్రణాళిక. ఇటీవల కోటంరెడ్డి అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉన్నారు. టీడీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని, అందుకే నిరసనలకు దిగారని వైసీపీ ఆరోపించింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు నెల్లూరు రూరల్ రాజకీయాలు మారిపోబోతున్నాయి.
శ్రీధర్ రెడ్డికి అంత అవసరం లేదు!
చేరితే ఇద్దరూ ఒకేసారి చేరొచ్చు కదా, ముందు తమ్ముడు, ఆ తర్వాత అన్న.. ఇదెక్కడి లాజిక్ అనుకుంటున్నారు కొంతమంది. అయితే ఇప్పటికిప్పుడు టీడీపీ కండువా కప్పుకోవాల్సిన అవసరం లేదని, స్వతంత్రంగానే ఉంటూ నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు, కోటంరెడ్డికి సూచించారని తెలుస్తోంది. మరోవైపు కోటంరెడ్డే స్వయంగా తన రూరల్ సమస్యలపై పోరాటం చేసి, వాటిని సాధించుకున్న తర్వాతే టీడీపీ కండువా కప్పుకుంటానని చంద్రబాబుకి చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏది నిజమో తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
అసంతృప్తులకోసమేనా..?
మరోవైపు కోటంరెడ్డి రాకను టీడీపీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ ఇన్ చార్చ్ గా ఉన్న అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలపై జరిగిన దాడి కేసు కూడా కోటంరెడ్డి, ఆయన అనుచరులపై ఉంది. ఆ దాడిలో బాధితులు కూడా కోటంరెడ్డి మాకొద్దు అంటున్నారు. ఈ దశలో ఇప్పటికిప్పుడు ఆయన టీడీపీలోకి రావడంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ముందు స్థానిక నేతలకు సర్ది చెప్పుకోవాల్సి ఉంది. అందుకే ముందుగా కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, ఆ తర్వాత అంతా సర్దుకున్నాక శ్రీధర్ రెడ్డి పార్టీలోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
పార్టీకి ఎంత బలం..?
కోటంరెడ్డి రాకతో నెల్లూరు రూరల్ లో టీడీపీకి కచ్చితంగా బలం పెరుగుతుంది. రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సొంత ఇమేజ్ తో చాలా పనులు చేశారు, ఆయనకంటూ ప్రత్యేక వర్గం ఉంది. ఆయన ఎటువైపు ఉంటే అటువైపు అనేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికీ ఆయన వెంట ఉన్నారు. కొంతమంది కాంట్రాక్ట్ బిల్లులు రాలేదని, తాత్కాలికంగా వైసీపీ వైపు ఉన్నా కూడా ఎన్నికలనాటికి వారంతా కోటంరెడ్డి వైపు వస్తారని అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా 2024లో కోటంరెడ్డి తన సొంతబలం ప్లస్ టీడీపీ ఓటుబ్యాంక్ తో మరింత పటిష్టంగా బరిలో దిగుతారు. ఆయన్ను ఎదుర్కోడానికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డబోతున్నారు. ఈ ఆసక్తికర పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.