YSRCP MLA Kotamreddy: సొంత నిధులతో పనులు చేపిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
MLA Kotamreddy Sridhar Reddy: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థానిక మహిళలు వీధుల్లో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
MLA Kotamreddy Sridhar Reddy: నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల చొప్పున ప్రతి ఎమ్మెల్యేకు నిధులిస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఆదేశాలిచ్చారు. కేవలం నోటి మాటగా కాకుండా ఈసారి జీవో కూడా విడుదల చేశారు. అయితే ఆ నిధులు ఎప్పటికొస్తాయో తెలియదు. ఈలోగా కొంతమంది ఎమ్మెల్యేలు సొంత నిధులతో పనులు మొదలు పెట్టేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇలాగే సొంత నిధులతో తన నియోజకవర్గంలో చకచకా పనులు జరిపిస్తున్నారు. తాజాగా ఆయన నెల్లూరు రూరల్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా తన సొంత నిధులు దీనికోసం ఖర్చు పెట్టారు.
డ్రైనేజీలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి..
ఇటీవల డ్రైనేజీలో నిలబడి రాష్ట్రవ్యాప్తంగా మరింత పాపులర్ అయ్యారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండి కూడా డ్రైనేజీలో నిలబడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇక గడప గడప కార్యక్రమంలో కూడా ఆయన జోరుగా పాల్గొంటున్నారు. ఆరోగ్యం సరిగా లేని వారికి, నిరుపేదలకు తన సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఓ చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేసారు, గతంలో ఓ బాధితురాలికి కంటిచూపు వచ్చేలా చేశారు. ఇటీవల గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు వాటిని ఏర్పాటు చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్, యనమలవారి వీధి లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థానిక మహిళలు వీధుల్లో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి అంగీకరించిన ఎమ్మెల్యే వెంటనే వాటిని అక్కడ అమర్చేందుకు కృషి చేశారు. తన సొంత నిధులు, స్నేహితుల సహకారంతో 30 లక్షల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ లో ప్రజలు కోరిన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు ఎమ్మెల్యే.
రక్షణ కోసం సీసీ కెమెరాలు..
ప్రజల రక్షణ కోసం, నేరాల అదుపు కోసం, పోలీసుల నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండటానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీస్ కార్యాయానికి అనుసంధానం చేసుకొని నిఘా వ్యవస్థ మరింత పటిష్టం చేయాలని సూచించారు. నెల్లూరు రూరల్ పరిధిలో రోడ్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నా ఎమ్మెల్యే సొంత పూచీకత్తుతో రోడ్ల నిర్మాణానికి మద్దతిచ్చారు. దీంతో జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకంటే రూరల్ లో రోడ్ల పనులు ముందుగా పూర్తవుతున్నాయి.
Also Read: Ramayapatnam Port: కృష్ణపట్నం పోర్ట్ ఉండగా, ఏపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్ట్ ఎందుకు నిర్మిస్తుందో తెలుసా !