Nellore News: కోడిగుడ్లు ఎక్కడంటూ ఎమ్మెల్యే ప్రశ్న, కాకులెత్తుకెళ్లాయ్ వంటమనిషి రిప్లై!
Nellore News: స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే.. బుధవారం గుడ్డు పెట్టలేదు, ఎక్కడని ప్రశ్నించగా.. కాకులెత్తుకెళ్లాయి అంటూ వంటమనిషి రిప్లై ఇచ్చారు.
![Nellore News: కోడిగుడ్లు ఎక్కడంటూ ఎమ్మెల్యే ప్రశ్న, కాకులెత్తుకెళ్లాయ్ వంటమనిషి రిప్లై! Nellore News MLA Nallapureddy Prasanna Kumar Fires on School head Master And Aaya Nellore News: కోడిగుడ్లు ఎక్కడంటూ ఎమ్మెల్యే ప్రశ్న, కాకులెత్తుకెళ్లాయ్ వంటమనిషి రిప్లై!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/30b82843acf8bbaeb203b5d229d30c071668056619442519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nellore News: స్కూల్ లో మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించడానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయా చెప్పిన సమాధానంతో ఆయన షాక్ కు గురయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పంచాయితీలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్... స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించేందుకు వెళ్లారు. ముందుగా స్కూల్ లో ఎంత మంది పిల్లలున్నారో తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అటెండెన్స్ చెక్ చేశారు. 150 మంది పిల్లలు ఉన్నారని తెలుసుకున్నారు. అయితే వంట గదిలోకి వెళ్లి చూడగా... అప్పుడే వంటమనిషి గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టింది. అయితే అవి చాలా తక్కువ మోతాదులో ఉండటంతో ఎమ్మెల్యే ఏంటని ప్రశ్నించారు.
35 గుడ్లు కాకులు ఎత్తుకెళ్లాయా..!
వంటమనిషిని ప్రశ్నించగా.. ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. వంటమనిషి చెప్పే మాటలు నమ్మలేక తన అసిస్టెంట్ తో వాటిని లెక్కపెట్టమని చెప్పారు. లెక్కపెట్టి చూసేసరికి.. 115 గుడ్లు మాత్రమే ఉన్నాయి. 35గుడ్లు ఏమయ్యాయమ్మా అని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్... నిలదీస్తే కాకులెత్తుకెళ్లాయంటూ కథలు చెప్పింది వంటమనిషి. దీంతో షాకైన ఎమ్మెల్యే ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ని పిలిపించి కాస్త గట్టిగానే కోటింగ్ ఇచ్చారు. మీ ఇంట్లో పిల్లలకి కూడా ఇలాగే ఫుడ్ పెడతారా అని నిలదీశారు. మరీ కాకులు ఎత్తుకెళ్లాయంటూ కాకమ్మ కథలు చెబితే నమ్మే వాడిలాగా కనపడుతున్నానా అంటూ మండిపడ్డారు. వెంటనే వంట సిబ్బందిని తొలగించాలని సూచించారు. ఇకపై ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయొద్దని గట్టిగానే హెచ్చరించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.
ఇటీవలే కంటతడి పెట్టిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్..
ప్రతిపక్షాలపై ఎప్పుడూ విమర్శలతో విరుచుకుపడే ఎమ్మెల్యే ప్రసన్న తనవారు అనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారని లోకల్‌గా టాక్ ఉంది. అనుచరులను ఎప్పుడూ ఆయన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారటని అనుచరులు చెప్పుకుంటారు. వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటారట. ఆ మధ్య నెల్లూరులో భారీ వర్షాలకు నష్టపోయిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన అండగా నిలిచారు. ఆయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు మీదుగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు ప్రసన్న.
ఇటీవల కోవూరు నియోజకవర్గంలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు మృతి చెందారు. ఆ ఇద్దరు కార్యకర్తలు ప్రసన్నకు బాగా ముఖ్యులు. వారి ఇంటికి పరామర్శకు వెళ్లిన ప్రసన్న కుమార్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్ కుటుంబాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయన భార్యను ఓదార్చారు, పిల్లలకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. తన వంతుగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ట్రస్ట్ ద్వారా ఈ ఆర్థిక సాయం అందించారు ప్రసన్న. ఈ క్రమంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ప్రసన్న అక్కడే కంటతడి పెడ్డారు. ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)