Minister Kakani on Pawan: ఆరిపోయే దీపానికి చేతులు అడ్డుపెడుతున్న పవన్, అంతా వృథా - కాకాణి
Kakani Goverdhan Reddy: మంత్రి రోజాపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపం అని, అలాంటి దీపానికి చేతులు అడ్డు పెట్టి పవన్ కల్యాణ్ కాపాడాలనుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. 10 పంటలు చూపెడితే, అందులో ఐదు పంటల పేర్లు చెప్పడం కూడా తెలీని లోకేష్.. పంట విరామం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. మంత్రి రోజాపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై కూడా కాకాణి తీవ్రంగా స్పందించారు. అయ్యన్నపాత్రుడు భాష చూసి.. ప్రజలు వారి ముఖాన ఉమ్మేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు జోరుగా ఉంటే చంద్రబాబు నాయుడు బేజారు అయిపోతాడని, అందుకే ఇప్పుడు రైతు పోరు అంటున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు సిగ్గు ఉంటే వారి హయాంలో రైతుకు చేసిన మేలు గురించి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
బాబు పాపాలు రాష్ట్రానికి శాపాలు..
చంద్రబాబు చేసిన పాపాలన్నీ రాష్ట్రానికి శాపాలుగా మారాయని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. చంద్రబాబు తనకు తాను యంగ్ అండ్ ఎనర్జిటిక్ అనుకుంటే మాకేమీ ఇబ్బంది లేదని, అయితే, ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో చెబితే బాగుంటుందని సెటైర్లు వేశారు. రైతు భరోసా, వైయస్సార్ చేయూత, అమ్మ ఒడి, ఆసరా, ఈబీసీ నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తామని తాము చెప్పామని, చెప్పిందే చేశామని అన్నారు. అలాంటి పథకాలు ఏమైనా ఒక్కటి చేశామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆయనలా దోపిడీ పథకాలు తామెక్కడా చేయలేదని, రైతులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదని చెప్పారు కాకాణి.
టీడీపీ వాళ్లు తాము దోచుకున్న కమీషన్ల మాట పక్కన పెట్టి ప్రజలకు ఏం చేశారనేది చెప్పాలని డిమాండ్ చేశారు కాకాణి. చెప్పుకునేందుకు ఏమీ లేకపోగా.. మహానాడులు పెట్టి మమ్మల్ని అయ్యన్నపాత్రుడితో బూతులు తిట్టించారని అన్నారు. టీడీపీ హయాంలో రైతు రథం, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకల పేరుతో దోచుకున్నారని అన్నారు. టీడీపీ నేతలు ఎంతసేపటికీ దోపిడీ పథకాలు అన్వేషించారే తప్ప రైతులకు, ప్రజలకు శాశ్వతంగా మేలు చేసేలా కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రైతులకు రూ. 87 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
ఎన్నడూ లేనివిధంగా ఒకే విడతలో దాదాపు 3 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తున్నామని చెప్పారు కాకాణి. చెప్పిన విధంగానే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తే.. వాటిపై ఎల్లో మీడియాలో రాతలు, కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే బాధనిపిస్తోందని అన్నారు. రైతులకు సంబంధించి నష్ట పరిహారం పూర్తిగా ఇవ్వలేదంటూ ఒక పత్రిక రాసిందని, వాటిని పట్టుకుని కనీస అవగాహన లేకుండా టీడీపీ నేతలు కొంతమంది విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కాకాణి. నిజంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఏవిధంగా ఇస్తారనే విషయంపై కనీస పరిజ్ఞానం లేకుండా ఆ రాతలు రాసినట్లు కనిపిస్తోందని చెప్పారు.