Venkaiah Naidu Laptops: వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ల్యాప్‌టాప్ అందుకోవాలనుకుంటున్నారా ?
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు సేవా కార్యక్రమాలవైపు ఆకర్షితులయ్యారు.
నిరుపేద విద్యార్థులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ల్యాప్ టాప్‌లు ఇవ్వబోతున్నారు. ఆయన చేతiలుమీదుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్టు తెలిపారు కార్యక్రమ నిర్వాహకులు. ఒకరిద్దరికి కాదు, ఏకంగా వందమంది పేద విద్యార్థులకు ఒక్కొకరికి 40 వేల రూపాయల విలువ చేసే ల్యాప్ టాప్ లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2024 జనవరి 10వతేదీన ఎంపిక చేసిన వందమంది పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు అందజేయనున్నారు.
దరఖాస్తు చేయడం ఎలా..?
కాలేజీ విద్య అభ్యసించే నిరుపేద విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థి ఆధార్ కార్డు, చదువుతున్న కాలేజీ వివరాలు, గతేడాది మార్క్స్ లిస్ట్, తల్లిదండ్రుల వివరాలతో 94923 34601 నెంబరుకు వాట్సాప్ చేయాలని నిర్వాహకులు తెలిపారు. వారి నుంచి ఎంపిక చేసిన వారికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ల్యాప్ టాప్‌లు ఇస్తారు.
ఎవరు ఇస్తారు..?
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లెకు చెందిన ప్రవాస భారతీయులు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాకొల్లువారి పల్లెకు చెందిన ఎన్ఆర్ఐ దనియాల వెంకటేశ్వరరావు, కాకొల్లు శ్రీనివాసులు ఈ ల్యాప్ టాప్‌ల వితరణకు ముందుకొచ్చారు. తమ అభిమాన నాయకుడు వెంకయ్య చేతుల మీదుగా వాటిని పేద విద్యార్థులకు అందిస్తామని అంటున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని రావిళ్ల నాగార్జున సమన్వయం చేస్తున్నారు. వెంకయ్య నాయుడు పర్యటన వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి 10న వెంకయ్య నాయుడు కాకొల్లువారి పల్లెలో పర్యటిస్తారని అప్పుడాయన చేతుల మీదుగా పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తామని చెప్పారు.
స్వర్ణ భారత్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ పేరుతో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలలో ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు సేవా కార్యక్రమాలవైపు ఆకర్షితులయ్యారు. వారి దాతృత్వంతో జిల్లాలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో నెల్లూరు నగరం కోసం నెల్లూరు నెక్స్ట్ అనే కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేశారు. ఎంతోమంది దీనికి సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చారు.
వెంకయ్య ఎప్పుడు నెల్లూరు వచ్చినా స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ట్రస్ట్ సేవలను మరింత విస్తరించేందుకు తెలుగు రాష్ట్రాల్లో శాఖలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, వికలాంగులకు కూడా ప్రత్యేక పరికరాలు అందిస్తుంటారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందిన చాలామంది ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతున్నారు. వారందరూ ఇప్పుడు తమ కాళ్లపై తాము సొంతగా నిలబడగలుగుతున్నారు. ఆ స్ఫూర్తితోనే నెల్లూరు జిల్లాకు చెందిన చాలామంది వెంకయ్య నాయుడు చూపిన బాటలో నడుస్తున్నారు.
తాజాగా కాకొల్లువారిపల్లెకు చెందిన ఎన్నారైలు పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు వితరణ చేసేందుకు ముందుకొచ్చారు. పేద విద్యార్థులు సాంకేతికంగా వెనకపడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.