Nellore Dasara Celebrations: అమ్మవారికోసం 100 కిలోల వెండిరథం, 1008 కలశాల పెన్నా జలంతో అభిషేకం!
Nellore Dasara Celebrations: నెల్లూరు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి కోసం వంద కిలోల వెండితో రథం తయారు చేయించారు. అలాగే 1008 కళశాల పెన్నా జలంతో అమ్మవారిని అభిషేకించనున్నారు.
Nellore Dasara Celebrations: నెల్లూరు నగరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్టోన్ హౌస్ పేటలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి కోసం 100 కేజీల వెండితో రథం తయారు చేశారు. ఈ నూతన రథాన్ని పెన్నానది నీటితో అభిషేకించారు. అమ్మవారిని అభిషేకించేందుకు 1008 మంది ముత్తయిదువులు 1008 కళశాల్లో పెన్నానది వద్దకు వెళ్లి మరీ నీటిని తీసుకొచ్చారు. రంగనాథ స్వామి ఆలయం వద్ద నుంచి మహిళలంతా భక్తి శ్రద్ధలతో కళశాలను పట్టుకొని కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. ఈ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. నూతనంగా చేయించిన వెండి రథంలో అమ్మవారిని కొలువుదీర్చి పూజలు, ఊరేగింపు నిర్వహించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు.. బాలాత్రిపుర సుందరీ దేవిగా!
త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. బాల త్రిపుర సుందరీ దేవిది త్రిగుణైక శక్తి - సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని. నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్యసంతోషం కలుగుతుందని విశ్వాసం. షోడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుల సుందరీ దేవి భక్తుల పూజలందుకుంటుంది.
త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు అయిన జాగృత్, స్వప్న , సుషుప్తి కి అధిష్ఠాన దేవత. మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటారు. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆత్మ స్వరూపురాలు అయిన బాలను పూజిస్తే జ్ఞానం, మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను త్రిపుర సుందరిగా అలంకరించి పూజ చేస్తారు.
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం..
బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ఏం చెప్పారంటే భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. వీళ్ళంతా అవిద్యా వృత్తులకు సంకేతం. వీళ్లంతా ఇంద్రాది దేవతలను నానా బాధలు పెట్టడంతో హంసలు లాగే రథంపై వచ్చిన కన్య ఈ 30 మంది భండాసుర పుత్రులనూ సంహరించింది. కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచీ బాల ఆరాధన చేయడం ప్రారంభించారు. హంసలు శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెబుతారు.