Nellore News: నెల్లూరు కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ యువకుడు అక్కడ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎడమ చేతి మణికట్టు వద్ద చాకుతో కోసుకున్నాడు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు అధికారులు.
దసరా సెలవలు కావడంతో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్దగా జనసంచారం లేదు. ఇంతలో సడన్ గా ఓ యువకుడు అక్కడ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎడమ చేతి మణికట్టు వద్ద చాకుతో కోసుకున్నాడు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు అధికారులు. పోలీసులు అతడిని నెల్లూరులోని జయభారత్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
విల్ పవర్ లేదు..
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి పేరు వంశీకృష్ణ. అతడి అమ్మ, నాన్న.. గతంలో తహశీల్దార్లుగా పనిచేసి రిటైర్ అయ్యారని చెబుతున్నాడు. వారి పేర్లు రఘురాం, రాజేశ్వరి అని చెబుతున్నాడు. ఇటీవల తన తల్లి కలెక్టరేట్ కు వచ్చినప్పుడు ఆమెను ఎవరో అవమానించారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. తన తల్లికి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పాడు ఆ యువకుడు. తనకు విల్ పవర్ లేదని, అందుకే ఆత్మహత్య ప్రయత్నం చేశానని చెబుతున్నాడు వంశీకృష్ణ. జయభారత్ ఆస్పత్రులో ఉన్న ఆ యువకుడు మీడియాతో మాట్లాడాడు.
మతి స్థిమితం లేనందుకే..
పైకి సాధారణంగా కనపడుతున్నా.. ఆ యువకుడికి మతి స్థిమితం లేనట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల వివరాలు అడిగితే తహశీల్దార్లు అని చెబుతున్నాడు కానీ, వారి పేర్లు రకరకాలుగా చెబుతున్నాడు. వారిని అవమానించినవారు ఎవరో కూడా తనకు తెలియదంటున్నాడు. అసలు ఆ అవమానానికి ఆత్మహత్యే పరిష్కారమా అంటే.. తనకు విల్ పవర్ లేదని, తాను అంతకంటే ఏమీ చేయలేనని చెబుతున్నాడు వంశీకృష్ణ.
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాను పని చేశానని చెబుతున్న వంశీకృష్ణ, ఇప్పుడు ఏం చేస్తున్నాడనే విషయంపై క్లారిటీ లేదు. తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడా..? అసలు కలెక్టరేట్ కి ఎలా వచ్చాడు..? ఎవరితో మాట్లాడాడు..? అనే విషయాలపై పూర్తి సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు.
మెడ కోసుకోవాలనుకున్నా..
తాను చనిపోవాలనుకున్నానని, ముందుగా మెడ కోసుకోవాలనుకున్నానని చెప్పాడు వంశీకృష్ణ. కానీ చేయి కోసుకున్నానని అన్నాడు. అతని వద్ద నుంచి పోలీసులు చాకు, పర్సు స్వాధీనం చేసుకున్నారు.
కలెక్టరేట్ లో కలవరం..
ప్రశాంతంగా ఉండే కలెక్టరేట్ ప్రాంగణంలో ఇలాంటి సంఘటనలు అరుదు.. రెండేళ్ల క్రితం ఓ మహిళ కలెక్టరేట్ కి పురుగుల ముందుతో వచ్చింది. ఆత్మహత్యాయత్నం చేసుకోబోయే లోపే కలెక్టరేట్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు వంశీకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. చేయి కోసుకోవడంతో కలెక్టరేట్ ప్రాంగణంలో రక్తం పడిపోయింది. ప్రశాంతంగా ఉంటే ఆ ప్రాంగణం కాసేపు ఆందోళనగా మారింది. కలెక్టరేట్ సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యులు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.