Minister Kakani Comments: సిగ్నల్ లేకే ఆహ్వానం అందలేదేమో- అనిల్ సెటైర్లపై కాకాణి కౌంటర్స్
వ్యవసాయ శాఖ మంత్రిగా తొలిసారి నెల్లూరు జిల్లాకు వచ్చిన కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత విభేదాలపై కూడా ఆయన స్పందించారు.
ఎవరు ఏ పని చేసినా, ఎంత కష్టపడినా 2024లో వైసీపీని తిరిగి అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమన్నారు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏ మూర్ఖుడు కూడా తన చేతులతో తన జీవితాన్ని పతనం చేసుకోవాలని అనుకోడని, దానివల్ల పార్టీకి నష్టం చేయాలని అసలు అనుకోడని అన్నారు. ఎవరు ఏం చేసినా 2024లో పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని అన్నారాయన. రాజీలేకుండా కలసికట్టుగా పనిచేస్తామన్నారు.
అనిల్ అన్నదాంట్లో తప్పేముంది..?
తాను మంత్రి పదవిలో ఉన్నప్పుడు కాకాణి అందించిన సహకారానికి తాను డబుల్ ఇస్తానంటూ ఇటీవలే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కాకాణి స్పందించారు. అనిల్ డబుల్ సహకారం ఇస్తామన్నారు దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. మా సహాయ సహకారాలు మీడియాకు తెలియవు కదా అని అన్నారు. తామెప్పుడూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటామని, రెట్టింపు సహకారం ఇస్తామన్న మాటను తాను ఆహ్వానిస్తానని అన్నారు.
అది వ్యక్తిగత విషయం..
కాకాణి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందలేదని అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాటలపై కూడా కాకాణి స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలపై తాను బయట డిస్కస్ చేయలేనని చెప్పారు. ఆహ్వానం అందలేదు అన్న విషయంలో చాలా కారణాలు ఉండొచ్చని, ఫోన్ సిగ్నల్ పనిచేయకపోవచ్చని, మెసేజ్ వెళ్లకపోవచ్చని అన్నారు.
అది సంఘవిద్రోహ శక్తుల పని..
ఫ్లెక్లీల వివాదంపై కూడా మంత్రి కాకాణి స్పందించారు. ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు దాన్ని పెంచడానికి సంఘవిద్రోహ శక్తులు ప్రయత్నిస్తాయని, దాన్ని పెద్దది చేయాలని చూస్తాయని అన్నారు కాకాణి. అలాంటి వ్యవహారం జరిగి ఉండొచ్చని చెప్పారు. అనిల్ వెళ్లి కాకాణి ఫ్లెక్సీ చించరు, కాకాణి వెళ్లి అనిల్ ఫ్లెక్సీ చించరు కదా అని ప్రశ్నించారు.
జిల్లాలో నేతలంతా కలిసే ఉన్నారని... వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు కాకాణి గోవర్దన్ రెడ్డి. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను విభేదాలు అనుకుంటే పొరపాటే అన్నారు.
టీడీపీ హైకోర్టుకెళ్లొచ్చు కదా!
నెల్లూరు కోర్టులో దొంగతనం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. కేసు పూర్వాపరాలు చెబుతూనే.. తానంటే గిట్టనివారు తనపై బురదజల్లడానికి తనను ఆ దొంగతనం కేసుతో ముడిపెడుతూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
2017లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై కేసు పెట్టారని చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లపాటు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయారని అన్నారు. ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు చెప్పిందని, చార్జ్ షీట్ ని మూడు సార్లు రిటర్న్ చేసిందని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. చార్జి షీట్ ఫైల్ అయిందని చెప్పారు.
ఈ చోరీ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. సీబీఐతో ఎంక్వయిరీ చేసినా, న్యాయవిచారణకైనా రెడీ అన్నారు. ఈ కేసులో ఇంకా అనుమానం ఉంటే టీడీపీ హైకోర్టుకు వెళ్లొచ్చు కదా అని సలహా ఇచ్చారు.