ఆ ఎమ్మెల్యేలకు మీరెంతిచ్చారు? వైసీపీని ప్రశ్నించిన కోటంరెడ్డి
పక్క పార్టీల నేతలు వైసీపీకి ఓటేస్తే నీతి అయినప్పుడు, వైసీపీ నేతలు పక్కపార్టీలకు ఓటు వేస్తే అవినీతి ఎలా అవుతుందన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంతిచ్చారని ప్రశ్నించారు.
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారం కాక రేపుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగా ప్రస్తుతానికి ఇద్దరే రియాక్ట్ అయ్యారు. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. నమ్మక ద్రోహం అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తగా.. అమ్ముడుపోయారనే మాటలకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ ఎంతిచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
షోకాజ్ ఎందుకు లేదు..?
పార్టీకి దూరంగా ఉంటున్న తమపై సస్పెన్షన్ వేటు వేయడం సరైన నిర్ణయమేనంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. కానీ తమతోపాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం అంటున్నారాయన. కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెన్షన్ ఆర్డర్లు ఇవ్వడం పెత్తందారీ ధోరణి అని మండిపడ్డారు. తనతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నామని, తమ విషయంలో సస్పెన్షన్ ఊహించిందేనన్నారు. అయితే మరో ఇద్దరు ఎమ్మెల్యేలను షోకాజ్ లేకుండా పార్టీనుంచి సస్పెండ్ చేయడం దారుణం అని చెప్పారు.
సజ్జలపై ఈసీ చర్యలు తీసుకోవాలి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కానీ, టీడీపీ కానీ.. తనను ఓటు అడగలేదన్నారు కోటంరెడ్డి. తాను ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేశానని చెప్పారు. టీడీపీకి ఓటు వేసింది తామేనంటూ వైసీపీ అధిష్టానం ఎలా నిర్థారణకు వచ్చిందని ప్రశ్నించారు. రహస్య ఓటింగ్ ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో తాము ఫలానా వారికి ఓటు వేశామంటూ పార్టీ ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. అలా ప్రకటించారంటే, వారికి ఓటింగ్ గురించి పూర్తి సమాచారం ఉండే ఉంటుందని, దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్ గా దృష్టి సారించాలన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తాము ఎవరికి ఓటు వేశామో సజ్జలకు ఎలా తెలిసిందన్నారు, ఆయన విషయంలో ఈసీ విచారణ జరపాల్సిందేనన్నారు. రహస్య ఓటింగ్ ని తమ పార్టీ అభాసుపాలుచేసిందని మండిపడ్డారు.
మీరెంతిచ్చారు..?
టీడీపీ నుంచి తమకు 15కోట్లనుంచి 20 కోట్ల రూపాయలు ముట్టాయని చెబుతున్న వైసీపీ అధిష్టానం దానికి రుజువులేమున్నాయని అడిగారు కోటంరెడ్డి. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలకు సజ్జల ఎంతిచ్చారని ప్రశ్నించారు. పక్క పార్టీల నేతలు వైసీపీకి ఓటు వేస్తే అది నీతి అయినప్పుడు, వైసీపీ నేతలు పక్కపార్టీలకు ఓటు వేస్తే అవినీతి ఎలా అవుతుందని లాజిక్ తీశారు. వైసీపీ నుంచి జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంత ముట్టజెప్పారని సూటిగా ప్రశ్నించారు.
సస్పెన్షన్ వ్యవహారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సాకుతో ఇలా ఇంత త్వరగా సస్పెండ్ చేస్తారని మాత్రం ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఊహించలేదు. అందులోనూ షోకాజ్ లు లేకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడంతో వారంతా మండిపడుతున్నారు. పైగా తాము అమ్ముడుపోయామంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బాధపడుతున్నారు. డబ్బులు ముట్టజెప్పారన్న వ్యవహారంపై కోటంరెడ్డి ఘాటుగా స్పందించారు. తమపై సస్పెన్షన్ వేటు వేస్తూ.. కార్యకర్తల్లో తమను పలుచన చేసేందుకే అధిష్టానం ఇలాంటి నింద వేసిందని అంటున్నారాయన. దమ్ముంటే ఆ నిందని నిరూపించాలని సవాల్ విసిరారు. తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని, అసలు ఏ పార్టీ తనను ఓటు అడగలేదని, ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేశానని అంటున్నారు.