బోణీ బేరం కోసం పోటీ- నెల్లూరులో కప్పు టీ రూ.10వేలు
మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు పోటీకి వెళ్లారు. పది పది పెంచుకుంటూ వెళ్లారు. చివరకు ఆ వేలం పాట కేశవులు దక్కించుకున్నాడు. 10వేల రూపాయలు చెల్లించి ఒక కప్పు టీ తీసుకున్నాడు. ఆ కేఫ్ కి బోణీ కొట్టాడు.
పంతం పట్టారంటే తగ్గేది లేదంటారు కొంతమంది. నెల్లూరోళ్లు ఇలాంటి పంతాలు మరీ ఎక్కువ. పంతానికి పోతే ఒరిగేదేమీ లేదని తెలిసినా కూడా తామె గెలవాలనుకుంటారు. అలాంటి ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన పోటీ ఏకంగా ఓ టీ కప్పుని వేలం పాటలో నిలబెట్టింది. 10రూపాయల ఆ టీ ఖరీదుని 10వేల రూపాయలకు చేర్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలోనే హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఏంటా కథ..?
కప్పు టీ ఖరీదు 10 రూపాయలు. కానీ నెల్లూరులో దాని ఖరీదు 10వేల రూపాయలు. అవును, ఇది నిజం. కప్పు టీ 10వేల రూపాయలు అవడానికి బలమైన కారణం కూడా ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య పంతం వల్ల వచ్చిన పోటీతో టీ రేటు అమాంతం వేలల్లోకి వెళ్లిపోయింది. సహజంగా వినాయకుడి లడ్డూ వేలం పాటల్లో ఇలాంటి పోటీ చూసి ఉంటాం. కానీ ఇక్కడ టీ షాపు ఓపెనింగ్ రోజు, తొలి టీ కోసం జరిగిన పోటీలో ఓ వ్యక్తి 10వేల రూపాయలకు టీ కప్పు సొంతం చేసుకున్నాడు. నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మీపురంలోని ఓ కొత్త టీస్టాల్ వద్ద ఈ ఘటన జరిగింది.
నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మీపురంలోని కేజీకే కల్యాణ మండపం వద్ద కొత్తగా ఓ టీ కేఫ్ ప్రారంభించారు. టీ షాప్ ఓనర్ తన స్నేహితులందర్నీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించాడు. అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసి మంచి ప్రచారం కల్పించాలనుకున్నాడు. కానీ అతను అనుకున్నదానికంటే ఎక్కువగానే ఆ టీ షాపుకి ప్రచారం వచ్చింది. అనుకోకుండా జరిగిన ఓ ఘటన ఇప్పుడు ఆ టీ కేఫ్ కి విపరీతమైన ప్రచారం వచ్చేలా చేసింది.
కాకుపల్లికి చెందిన కోసూరు కేశవులు, ఉప్పల ఈశ్వరయ్య.. టీ షాపు ఓనర్ కి తెలిసినవారు. వారిద్దరూ ఆ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లారు. మొదటగా టీ తయారు చేసిన ఓనర్.. దాన్ని బోణీ చేయాలని వచ్చినవారిని కోరాడు. 500 రూపాయలు ఇచ్చి ఆ టీ తాను తీసుకుంటానని చెప్పాడు ఈశ్వరయ్య. తాను వెయ్యి రూపాయలు ఇస్తానని, తానే బోణీ చేస్తానని చెప్పాడు కేశవులు. ఇలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు పోటీకి వెళ్లారు. పది పది పెంచుకుంటూ వెళ్లారు. చివరకు ఆ వేలం పాట కేశవులు దక్కించుకున్నాడు. 10వేల రూపాయలు చెల్లించి ఒక కప్పు టీ తీసుకున్నాడు. ఆ కేఫ్ కి బోణీ కొట్టాడు.
ఈ మాట ఆ నోటా ఈనోటా బాగా ప్రచారంలోకి వచ్చింది. కోసూరు కేశవులు 10వేల రూపాయల టీ తాగాడని, కప్పు టీ కోసం 10వేలు ఖర్చు పెట్టాడనే ప్రచారం బాగా జరిగింది. ఆయన పేరుతోపాటు, ఆయన టీ తాగిన కేఫ్ పేరు కూడా మారుమోగిపోయింది. ఇక కోసూరు కేశవులికి ఇంట్లో దబిడ దిబిడే అనేది వేరే విషయం అంటున్నారు సన్నిహితులు. టీ కోసం బయటకు వెళ్లి వేలం పాట పెట్టి 10వేల రూపాయలు తగలేస్తావా అంటూ కుటుంబ సభ్యులు కేశవుల్ని నిలదీశారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ టీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.