YSRCP ఎమ్మెల్యే ఆనంకు జగన్ షాక్! తాజాగా మరోసారి, సీఎం ఏం చేశారంటే?
నియోజకవర్గ ఇన్ చార్జ్ గా రామ్ కుమార్ రెడ్డిని నియమించినప్పుడే ఆనంను పార్టీ పక్కనపెట్టిందనే సంకేతాలు వెళ్లాయి. ఆనంకి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మాట్లాడటం మొదలు పెట్టారు.
ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి వైసీపీలో మరీ ఘోరంగా తయారైపోయింది. ఆయన వెంకటగిరిలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన పవర్లన్నీ కట్ చేశారు సీఎం జగన్. అదే నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పార్టీ నియమించింది. ఆ తర్వాతి రోజునుంచే ఆనంకి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మాట్లాడటం మొదలు పెట్టారు. దాదాపుగా ఆయన వైసీపీలో ఒంటరిగా మారిపోయారు.
ఇప్పుడు మరో షాక్..
ఆనంకి షాకుల మీద షాకులిస్తోంది వైసీపీ. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించినప్పుడే ఆనంను పార్టీ పక్కనపెట్టిందనే సంకేతాలు వెళ్లాయి. తాజాగా ఆయనకు ఉన్న భద్రతను ప్రభుత్వం తగ్గించింది. అది కూడా అవమానకర రీతిలో ఉందని అంటున్నారు. ఆనంకి ప్రస్తుతం 2 ప్లస్ 2 గన్ మెన్ల భద్రత ఉంది. దాన్ని ఇప్పుడు 1 ప్లస్ 1 కి కుదించారు. ఈ విషయాన్ని నేరుగా ఆనంకి కూడా తెలియపరచలేదు. ఆనం గన్ మెన్లకే నేరుగా మెసేజ్ లు వచ్చాయి. ఆయా కానిస్టేబుళ్లు కొత్తగా ఎక్కడ విధుల్లో చేరాలనే విషయాన్ని మాత్రమే వారికి మెసేజ్ ల రూపంలో తెలియపరిచారు. దీంతో వారు ఆనంకి చెప్పి వెళ్లిపోయారు.
రిలీవింగ్ లెటర్ అక్కర్లేదు..
తనవద్ద నుంచి వెళ్తున్న సిబ్బందికి తాను రిలీవింగ్ లెటర్ ఇవ్వకపోవడంతో డీఎస్పీ మాట్లాడారని చెప్పారు ఆనం. భద్రత కుదింపు విషయంలో లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని తాను డీఎస్పీని కోరినట్టు తెలిపారు. డీఎస్పీ స్పందించకపోవడంతో.. ఆనం కూడా కానిస్టేబుళ్లకు రిలీవింగ్ లెటర్ ఇవ్వలేదు.
ఆనం ఘాటు స్పందన..
గతంలో తాను టీడీపీలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తనకు 1 ప్లస్ 1 భద్రత ఉండేదని గుర్తు చేశారు ఆనం. ఆ తర్వాత ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2 ప్లస్ 2 భద్రత పెంచారని, వెంకటగిరి నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కావడం.. ఎర్రచందనం స్మగ్లర్ల ఏరియా కావడంతో తనకు భద్రత పెంచారని, కానీ ఇప్పుడు ఎందుకు తగ్గించారో తనకు తెలియదన్నారు.
ఆనం అభిమానుల ఆందోళన..
కావాలనే కక్షపూరితంగా ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఆనంకి భద్రత తగ్గించడంపై వారు మండిపడ్డారు. భద్రత తగ్గిస్తే ఆనం ప్రాణాలకు ముప్పుంటుందని.. ఆయన ప్రజల్లో తిరగకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు.
ఆనం పరిస్థితి ఏంటి..?
ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. నియోజకవర్గంలో ఆయన హవా మాత్రం తగ్గిపోయింది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అధికారులంతా వంతపాడుతున్నారు. ఆయన కొత్తగా నియోజకవర్గ పరిధిలో నియామకాలు చేపట్టారు. నేదురుమల్లి తన వర్గానికి చెందిన అధికారులను నియోజకవర్గ కేంద్రంలో నియమించుకున్నారు. కొత్తగా వచ్చిన వెంకటగిరి మున్సిపల్ కమిషనర్.. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం నడచుకుంటానని చెప్పడం విశేషం. ఇప్పుడు ఆనంకు అధికారులు, ఇతర సిబ్బంది నుంచి కూడా సహాయ నిరాకరణ ఎదురయ్యే ప్రమాదం ఉంది. సమీక్షలు, సమావేశాల విషయంలో ఆయన్ను ఎవరూ లెక్కచేయకపోవచ్చు. అంతా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హవా నడుస్తోంది.