నెలరోజుల గ్యాప్ లో నెల్లూరుకి సీఎం జగన్.. ఎందుకంటే..?
ఇటీవల రామాయపట్నం పోర్ట్ భూమిపూజ కోసం సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈనెల మరోసారి ఆయన జిల్లాకు వచ్చే అవకాశముంది.
ఇటీవల రామాయపట్నం పోర్ట్ భూమిపూజ కోసం సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈనెల మరోసారి ఆయన జిల్లాకు వచ్చే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో రెండు బ్యారేజ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు పూర్తి కావస్తున్నాయి. అందులో ఒకటి సంగం బ్యారేజి. దీనికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అనే పేరు పెట్టాలనేది జగన్ ఆలోచన. దానికి తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ దివంగత నేత గౌతమ్ రెడ్డి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కందుకూరు నెల్లూరు జిల్లాలోనే..
నెల్లూరు జిల్లా నాయకులతో జరిగిన మీటింగ్ లో సీఎం జగన్ మరో విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు నెల్లూరు జిల్లాలో కలిసింది. దీనిపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి కూడా ఈ మీటింగ్ లో తెరపడింది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కొత్తగా కందుకూరు నెల్లూరు జిల్లాలో కలవడం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వెంటనే ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని కలెక్టర్ చక్రధర్ బాబునుకు ఆదేశాలిచ్చారు సీఎం జగన్. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని సూచించారు. దీంతో కొద్దిరోజులుగా కందుకూరు విషయంలో జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది. కందుకూరు నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతుందని అధికారులు, ఎమ్మెల్యేలకు మరోసారి సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్టయింది.
గడప గడపలో ప్రసన్న..
గతంలో గడప గడపకు మన ప్రభుత్వం విషయంలో అలసత్వం వహిస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఆయన నెలరోజుల షెడ్యూల్ ప్రకటించి మరీ గడప గడపలో జాయిన్ అయ్యారు. ఆ కారణంగా ఆయన జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం మీటింగ్ కి హాజరు కాలేకపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇటీవల ప్రారంభించిన రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నారంపేట ఇండస్ట్రియల్ పార్కులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, పారిశ్రామివేత్తలను గుర్తించడం వంటి వివరాలు కూడా అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబంధించిన ఇబ్బందులు తెలపాలని కోరారు. పాదయాత్రలోగానీ, జిల్లాకు వచ్చిన సందర్భాల్లో ఇచ్చిన హామీల్లో ఏమైనా చేయాల్సి ఉంటే గుర్తు చేయాలని ఎమ్మెల్యేలను కోరారు జగన్. పెన్నా పొర్లుకట్ట నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించారు, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సంగం బ్యారేజీ పనులు ఈనెల 15లోపు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసుకుని ఈనెల 17నుంచి 20వతేదీ లోపు ఆ బ్యారేజీ పనుల ప్రారంభానికి నెల్లూరు జిల్లాకు వస్తానని చెప్పారు సీఎం జగన్.