కాసేపు సెల్ఫీలు, తర్వాత వాకింగ్-యువగళంపై కాకాణి సెటైర్లు
లోకేష్ యాత్రకు స్పందనే లేదని చెప్పారు. లోకేష్ తో ఎవరూ కలసి నడవడానికి ఇష్టపడలేదని చెప్పారు. నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగానే పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు కాకాణి.
నారా లోకేష్ యువగళం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగానే స్థానిక వైసీపీ నేతలు ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. జిల్లా మంత్రి కాకాణి యువగళంపై సెటైర్లు పేల్చారు. సోషల్ మీడియాలో యువగళం గురించి చాలా హైప్ చేశారని, కానీ నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగానే పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. లోకేష్ యాత్రకు స్పందనే లేదని చెప్పారు. లోకేష్ తో ఎవరూ కలసి నడవడానికి ఇష్టపడలేదని చెప్పారు. అసలు లోకేష్ యాత్రలో ప్రజలు ఎందుకు పాల్గొనాలి అని ప్రశ్నించారు కాకాణి.
2వేలమంది కూడా లేరు..
నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువ గళం అట్టర్ ఫ్లాప్ అయిందంటున్న మంత్రి కాకాణి.. జిల్లా జనాభాలో కనీసం ఒక శాతం మంది కూడా లోకేష్ కి స్వాగతం చెప్పేందుకు వెళ్లలేదన్నారు. 2 వేల మంది కూడా పాదయాత్రకు రాలేదున్నారు. కడప జిల్లా వాళ్లు కూడా కలిసే ఉన్నారు కాబట్టి ఆమాత్రం జనాలయినా కనపడుతున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో యువ గళం మూగబోయిందన్నారు కాకాణి. యువ గళంకు వచ్చేవారిని ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు.
గతంలో ఎందరో నేతలు పాదయాత్ర చేశారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన యాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని చెప్పారు కాకాణి. ఆ యాత్రను చూసి చంద్రబాబు ఆ తర్వాత యువగళం యాత్ర చేపట్టి ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. అధికారం లోకి వచ్చిన తర్వాత హామీలన్నింటిని విస్మరించారని చెప్పారు. ఆమోసం తట్టుకోలేకే, ప్రజలు 2019లో చంద్రబాబును ఘోరంగా ఓడించారన్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఆయన ఒక లక్ష్యం ప్రకారం పాదయాత్ర చేశారని చెప్పారు కాకాణి.
లోకేష్ పాదయాత్రకు ఒక ఉద్దేశం, లక్ష్యం లేదన్నారు మంత్రి కాకాణి. ఎండగా ఉందని మధ్యాహ్నం దాకా పడుకుంటున్నారని, ముందు సెల్ఫీల కార్యక్రమం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టోని విడుదల చేశారన్నారు. అందులో కూడా కర్నాటక నుంచి కొన్ని, వైసీపీ మేనిఫెస్టోలో కొన్నింటిని కాపీ చేశారని కౌంటర్ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ హయాంలలో జరిగిన పనుల వద్ద లోకేష్ సెల్ఫీ తీసుకోవాలని హితవు పలికారు కాకాణి. సంగం, నెల్లూరు బ్యారేజీలను కూడా చూడాలని చెప్పారు. యువ గళంలో యువకులు లేరని, అందరూ ముసలివాళ్లేనని చెప్పారు. బీజేపీతో దోస్తీ కట్టడానికి చంద్రబాబు తహతలాడుతున్నారని చెప్పారు. గతంలో మోదీని చంద్రబాబు తిట్టారని, మళ్ళీ ఇప్పుడు మోదీ దగ్గరికి వెళ్లాలని బాబు అనుకుంటున్నారని చెప్పారు కాకాణి.
సింగిల్ గానే వస్తాం..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు మంత్రి కాకాణి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో వైసీపీ సఖ్యతగా మెలుగుతుందని గతంలో జగన్ పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు కాకాణి. బీజేపీతో ఏరోజూ వైసీపీ జత కట్టలేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఓటుకు నోటు కేసు గురించే కేంద్రంతో చర్చించేవారని ఎద్దేవా చేశారు. పదవి కాపాడుకోవడానికే చంద్రబాబు పడరాని పాట్లు పడ్డారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడతామంటే డబ్బుల కోసం తానే నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారని, ప్రత్యేక హోదా ను తాకట్టుపెట్టి ప్రత్యేక ప్యాకేజీ కి అంగీకరించారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నా రాష్ట్రం కోసం ఏమీ సాధించలేదని చంద్రబాబు
కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ నిధులను జగన్ తీసుకొస్తున్నారని, దాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అన్నారు కాకాణి. 2019 ఎన్నికలప్పుడు మోదీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీ వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్రను.. యువ గళం కార్యక్రమాన్ని బేరీజు వేసి చూస్తున్నారని అన్నారు.