Govt on Ration Shops: రేషన్ దుకాణాలు మూసివేయడం లేదంటూ మంత్రివర్గ ఉపసంఘం క్లారిటీ!
Govt on Ration Shops: ఏపీలో మొత్తం 4 కోట్ల 23 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందుతున్నాయని... రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా పచిష్ఠంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Govt on Ration Shops: ఏపీలో ప్రజా పంపిణీ పటిష్టంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 4 కోట్ల 23 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ వల్ల న్యాయం జరుగుతుందని అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ... ప్రపంచంలో కోవిడ్ సంక్షోభం వచ్చింది, కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజన అని బియ్యం ఇచ్చేందుకు ఒక పథకం ప్రవేశ పెట్టిందన్నారు. కొవిడ్ వచ్చాక ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 2022 వరకు రేషన్‌లో బియ్యం ఇస్తూనే ఉందన్నారు. లబ్ధిదారులు పెరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం బియ్యం అందించిందని తెలిపారు. దీనిపై సీఎం ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారని అన్నారు.
వచ్చే నెల ఒకటో తేదీ నుంచే బియ్యం పంపిణీ..
ప్రజా పంపిణీ ద్వారా బీపీఎల్‌లో తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్న 89 లక్షల మందితో పాటు అంత్యోదయ కార్డులు ఉన్న వారికి కూడా బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి కేజీ రూపాయి బియ్యం మద్యాహ్నం వరకు డోర్ డెలివరీ ఉంటుందని వివరించారు. సాయంత్రం 3.30 నుంచి డిపోల దగ్గర ఉచితంగా బియ్యం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ నుంచి ఇచ్చే బియ్యం... సారైక్స్ బియ్యం ఇస్తున్నామని, ఉచితంగా ఇచ్చే బియ్యం మాత్రం నాన్ సారైక్స్ బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
విద్యా , వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని..
విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం జగన్ తెలిపారని.. పోటీ తత్వంతో విద్య ఉండాలన్నదే జగన్ ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సంఘాలతో తాను ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నానని బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అమలు చేస్తూ.. వారి ఉద్యోగాలకు ఇబ్బంది అయితే పోరాటాలు చెయ్యాలని, లేదంటే చర్చలు జరపాలని అన్నారు. పేద పిల్లలకి కూడా ఫౌండేషన్ నుంచి విద్య ఉండాలనేదే ప్రధాన సంకల్పం అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
కోటి 46 లక్షల బియ్యం కార్డులు..
విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశ పెడుతున్నామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని అన్నారు. మంత్రి వర్గ ఉప సంఘం నిర్వహించిన సమీక్ష అనంతరం మంత్రులు బొత్స, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయని, వచ్చే నెల 1 నుంచి బియ్యం రేషన్ ద్వారా ఇస్తామని అన్నారు. 1 కోటి 46 లక్షల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం అందుతాయని, రేషన్ షాప్స్ మూసి వేసే ప్రసక్తి లేదని క్లారిటి ఇచ్చారు. కొత్తగా ఏడు లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని వెల్లడించారు.