AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈరాజకీయాల్లో మాజీ మంత్రి అనిల్ ఒంటరిగా మారారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమని సాక్షాత్తూ అనిల్ మాటల్లోనే తేటతెల్లమవుతోంది.
నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈరాజకీయాల్లో మాజీ మంత్రి అనిల్ ఒంటరైనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమని సాక్షాత్తూ అనిల్ మాటల్లోనే తేటతెల్లమవుతోంది. పేర్లు చెప్పలేదు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు నెల్లూరులో వైరి వర్గాలతో టచ్ లో ఉన్నారని అంటున్నారు అనిల్. అందరూ కలసి రాత్రుళ్లు ఫోన్ రాజకీయాలు చేస్తున్నారని, తనని టార్గెట్ చేస్తున్నారని, అయినా డోంట్ కేర్ అంటున్నారు. ఇంతకీ అనిల్ ఆగ్రహం ఎవరిపై..? అనిల్ ని ఇబ్బంది పెడుతోంది ఎవరు..? అసలు అనిల్ తో ఎవరికి గొడవలున్నాయి.
నెల్లూరులో స్వపక్షం, విపక్షం కలిసిపోయాయా ?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ కలకలం రేపారు. నెల్లూరు రాజకీయాల్లో స్వపక్షం, విపక్షం అన్నీ కలసిపోయాయంటున్నారు. రాత్రికి వైసీపీ నేతలతో వైరి వర్గాలు టచ్ లోకి వస్తున్నాయని, తనని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు దండుకుంటున్నారని, ఒకరు 10వేల రూపాయల బ్యాచ్ అయితే, ఇంకొకరు లక్ష రూపాయల కాస్ట్ లీ బ్యాచ్ అంటూ విమర్శిస్తున్నారు. అయితే అనిల్ వ్యాఖ్యలు వైసీపీ నేతల్ని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తనకి వ్యతిరేకంగా తన పార్టీలోనే కుట్ర జరుగుతోందని పరోక్షంగా ప్రస్తావించారాయన. రాత్రయితే తమ పార్టీ ఎమ్మెల్యేలతోనే కొంతమంది గూడుపుఠాణీ సాగిస్తున్నారనేది అనిల్ ఆరోపణ. ఆమధ్య పార్టీలో వెన్నుపోటుదారులున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనిల్. తాజాగా మరోసారి తన ఆవేదన ఇలా వెలిబుచ్చారు. ఇంతకీ సొంతపార్టీలో అనిల్ కి వెన్నుపోటు పోడుస్తున్న ఆ నేతలెవరు...? వైరి వర్గంతో టచ్ లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? అనేది తేలాల్సి ఉంది.
మొదటినుంచీ దూకుడుగా..
అనిల్ రాజకీయం మొదటినుంచీ దూకుడుగానే ఉంది. మంత్రి పదవి వచ్చాక, ఆయన రాష్ట్రవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు. సీఎం జగన్ పై ఎవరు ఎటువైపునుంచి విమర్శలు చేసినా, వారి నోటికి తాళం వేసే పని అనిల్, కొడాలి నాని, పేర్ని నాని చేసేవారు. కానీ ఆ ముగ్గురుకీ సెకండ్ లిస్ట్ లో మంత్రి పదవులు లేవు. మాజీ మంత్రులయినా వారు తమ దూకుడు తగ్గించలేదు. అనిల్ కి రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్నా, ఆయన సామాజిక వర్గంలో క్రేజ్ ఉన్నా కూడా సొంత జిల్లాలో మాత్రం ఆయన ఒంటరి అయినట్లు కనిపిస్తోంది. ఆమధ్య మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఆయనకున్న విభేదాలు సీఎం జగన్ వరకు వెళ్లాయి. ఆ తర్వాత ఎవరిదారి వారే అన్నట్టున్నారు. ఒకరి కార్యక్రమాలకు, ఇంకొకరు రారు, ఒకరి నియోజకవర్గంలోని పనులకు ఇంకొకరికి ఆహ్వానాలు ఉండవు. ఒకవేళ ఉన్నా.. ఎప్పుడూ కలిసి స్టేజ్ పైన కనిపించిన దాఖలాలు లేవు.
కాకాణి సంగతి పక్కన పెట్టినా.. నెల్లూరు టౌన్ లో అనిల్ కి కాస్త ఇబ్బందికర వాతావరణం సృష్టించేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. నెల్లూరు టౌన్ లో అనిల్ ఆఫీస్ కి రాజన్న భవన్ అనే పేరుంది. అయితే ఇప్పుడు దీనికి పోటీగా టౌన్ లోనే జగనన్న భవన్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు నెల్లూరు నగర కార్పొరేషన్లో కూడా అనిల్ వర్గానికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో అనిల్ అప్పుడప్పుడూ ఇలా స్పందిస్తున్నారు. గతంలో కూడా వెన్నుపోటు రాజకీయాలంటూ మాట్లాడి కలకలం సృష్టించారు అనిల్, తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో పక్క పార్టీల నేతలు కుమ్మక్కయ్యారని విమర్శించారు. అంటే పక్క పార్టీల నేతలతో తమ పార్టీ ఎమ్మెల్యేలు లాలూచీ పడ్డారని పరోక్షంగా అనిల్ విమర్శించినట్టే లెక్క. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరు, రాత్రివేళ సెల్ ఫోన్ పాలిటిక్స్ నడుపుతోంది ఎవరనేది తేలాల్సి ఉంది. ఈ కుట్ర రాజకీయాలను అనిల్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా లేక, తనకు తానే పరిష్కరించుకుంటారా.. తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.