నీ జాతకం బయటకు తీస్తాం-`కోటంరెడ్డికి ఆదాల, కాకాణి హెచ్చరిక
అండగా నిలిచిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశారని చెప్పారు కాకాణి. కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. వాపును చూసి బలమనుకుని కోటంరెడ్డి భ్రమపడుతున్నాడని అన్నారు..
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో అలా ఆదాల వర్గం కూడా ప్రెస్ మీట్ పెట్టేసింది. కోటంరెడ్డిని చెడామడా తిట్టేసింది. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సహా, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోటంరెడ్డి జాతకం బయటకుతీస్తామని హెచ్చరించారు ఎంపీ ఆదాల.
కోటంరెడ్డి తన ప్రెస్ మీట్ లో నేరుగా ఆదాలను టార్గెట్ చేయడంతో దానికి ఆదాల కౌంటర్ ఇచ్చారు. ఆదాలను కోటంరెడ్డి పెళ్లి పీటలపై నుంచి పోరిపోయిన పెళ్లికొడుకుగా అభివర్ణించారు. 2019 ఎన్నికల సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ప్రచారం కూడా చేసిన ఆదాల, చివరకు వైసీపీలో చేరారని ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు. దీనికి ఆదాల కౌంటర్ ఇచ్చారు.
ప్రతీరోజూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశాల్లో పచ్చి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు ఆదాల. ఈరోజు వరకు తాను ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేశానన్నారు. మూడున్నర ఏళ్లలో కోటంరెడ్డి ఎన్ని అరాచకాలు చేశారనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని హెచ్చరించారు. కోటంరెడ్డికి పార్టీ, కార్యకర్తలు అవసరం లేదని, డబ్బు మీదు ఆయనకు ప్రేమ ఎక్కువని, అందుకే ఎలాంటి పని చేయడానికైనా కోటంరెడ్డి వెనుకాడలేదన్నారు. ఆయన జాతకం మొత్తం త్వరలో బయటకు వస్తుందన్నారు ఆదాల. కొన్ని రోజుల్లోనే ప్రజలకు కోటంరెడ్డి గురించి అన్ని విషయాలను చెబుతానన్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని కోటంరెడ్డి.. ప్రజలను, రియల్టర్లను, వ్యాపారులను ఎలా బెదిరించావో అందరికీ తెలుసన్నారు. ఇకనైనా కోటంరెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఎంపీ ఆదాల.
కాకాణి కూడా కోటంరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో కోటంరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు కాకాణి. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి చెప్పింది అబద్దమని ఆయన స్నేహితుడు శివారెడ్డి చెబుతున్నారని, శ్రీధర్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్ అని చెబుతున్నారని, అక్కడ జరిగింది రికార్డింగ్ కానీ, ట్యాపింగ్ కాదన్నారు.
అది చంద్రబాబు ట్రాప్..
కోటంరెడ్డి విషయంలో జరిగింది ఫోన్ ట్యాప్ కాదని, చంద్రబాబు ట్రాప్ అని మరోసారి స్పష్టం చేశారు కాకాణి. శ్రీధర్ రెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. ట్యాపింగ్ ఆరోపణలు నిజమైతే కోటంరెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్నారు. కోర్టుకి వెళ్తే తానే ఆధారాలు చూపించాల్సి వస్తుందని, ఫోన్ కూడా కోర్టుకి ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ఆయన కోర్టుకి వెళ్లడం లేదన్నారు. అండగా నిలిచిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశని చెప్పారు కాకాణి. కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. వాపును చూసి బలమనుకుని కోటంరెడ్డి భ్రమపడుతున్నాడని చెప్పారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారన చెప్పారు. కోటంరెడ్డి తన బలం ఇదీ అంటూ కార్పొరేటర్లను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు. అటు ఆదాల వర్గం కూడా కార్పొరేటర్లందరితోపాటు మంత్రిని కూడా కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టింది.