PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
PSLV C-53 Launch : ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి53 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 30న నింగిలోకి వాహక నౌక దూసుకుపోనుంది.
PSLV C-53 Launch : ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి53 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండో ప్రయోగ వేదికకు రాకెట్ ను చేర్చారు. వాహన అనుసంధాన భవనంలో లాంచ్ పెడస్టల్ పై పీఎస్ఎల్వీ సి-53ని అనుసంధానం చేసి బోగీ సాయంతో దాన్ని రెండో ప్రయోగ వేదిక వద్దకు చేర్చారు. ఆదివారం ఉదయం ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
జూన్ 30న ప్రయోగం
ప్రయోగానికి సంబంధించిన ఇస్రో డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేశారు. ఈ దశలో రెండు రోజులపాటు వివిధ రకాల పరిశీలనలు, పరీక్షలు చేస్తారు. అనంతరం రిహార్సల్ నిర్వహించాక ముందస్తు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు కౌంట్ డౌన్ మొదలుపెడతారు. ఈ కౌంట్ డౌన్ 25 గంటలపాటు నిరంతరాయంగా సాగుతుంది. కౌంట్ డౌన్ అనంతరం ఈనెల 30న సాయంత్రం ఆరు గంటలకు పీఎస్‌ఎల్‌వీ సి-53 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు ఉపగ్రహాలు నింగిలోకి
పీఎస్ఎల్వి సి-53 వాహక నౌక మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తుంది. వీటిలో ఒకటి DS-EO, బరువు 365 కిలోలు. ఇంకొకటి సింగపూర్ కి చెందిన న్యూసార్. దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. ఇక మూడో ఉపగ్రహం SCOOB-I. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు 2.8 కిలోలు మాత్రమే.
DS-EO ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రో-ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్ ను కలిగి ఉంటుంది. సింగపూర్ కి చెందిన న్యూసార్ ఉపగ్రహం SAR పేలోడ్ ను మోసుకెళ్లే మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పగలు, రాత్రి, అన్ని వాతావరణ పరిస్థితులలో చిత్రాలను అందించగలదు. మూడో ఉపగ్రహం SCOOB-I స్టూడెంట్ శాటిలైట్ సిరీస్ (S3-I), సింగపూర్‌లోని NTU స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లోని శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థులు దీన్ని తయారు చేశారు.
55వ మిషన్
నాలుగు దశలలో ఈ ప్రయోగం జరుగుతుంది. 44.4 మీటర్ల పొడవు గల PSLV-C53 వాహక నౌక. DS-EO ఉపగ్రహాన్ని 570 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత మిగతా ఉపగ్రహాలను కూడా కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది. ఇది PSLV 55వ మిషన్. PSLV-కోర్ అలోన్ వేరియంట్ ను ఉపయోగించి చేస్తున్న 15వ మిషన్ గా అధికారులు ప్రకటించారు. ఇక షార్ సెంటర్ లోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తున్న 16వ పీఎస్ఎల్వీ రాకెట్ ఇది. ఈనెల 30న సాయంత్రం ఆరు గంటలకు పీఎస్‌ఎల్‌వీ సి-53 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది.
Please come and witness the launch of PSLV-C53 on Thu, June 30, 2022, at 6 pm LIVE from the viewers’ gallery at SDSC-SHAR, the Spaceport of India. Register at https://t.co/J9jd8yDs4a between 10 am on June 23 and 4 pm on June 28. Covid-appropriate behavior solicited. pic.twitter.com/4xNIWTieKO
— ISRO (@isro) June 22, 2022