Nellore Fire Accident : నెల్లూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన ఎన్నికల డాక్యుమెంట్స్
Nellore Fire Accident : నెల్లూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ లో మంటలు చెలరేగి ఎన్నికల సామాగ్రి కాలి బూడిదైంది.
Nellore Fire Accident : నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ లో ఈ ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి ఫైర్ సిబ్బంది తరలివచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గోడౌన్ లో ఉన్న ఎన్నికల సామాగ్రి కాలి బూడిదైంది. గోడౌన్ లో ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. రెండో శనివారం కావడంతో సిబ్బంది అంతా సెలవులో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. గతంలో నెల్లూరు కలెక్టరేట్ లో సివిల్ సప్లైస్ కి చెందిన భవనంలో కీలక ఫైళ్లు తగలబడిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ప్రమాదంలో విలువైన వస్తువులేవీ లేవని, ఫైళ్లు కూడా ఆ గోడౌన్ లో లేవని అధికారులు చెబుతున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం, 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ SMS - 2 లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో ద్రవ ఉక్కు పడి 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒక డీజీఎం, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బాధితులను విశాఖ జనరల్ హాస్పిటల్ కి తరలించారు.
శ్రీశైలం నిత్యాన్నదాన భవనంలో ప్రమాదం
శ్రీశైలం దేవస్థానం నిత్యాన్నదాన భవనంలో వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ మరోసారి పేలిపోయింది. బాయిలర్ పేలుడంతో సిబ్బంది భయాందోళన చెందారు. నిత్యాన్నదాన బయట వైపు పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పిందని సిబ్బంది తెలిపారు. అధిక వేడి కారణంగా ప్రజర్‌కు బాయిలర్ పేలినట్లు తెలుస్తోంది. వేడి నీళ్లు పడటంతో ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన వైద్యసాయం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దేవస్థానం ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 8:46 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ పూజలు జరిగాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు రద్దు చేశారు.
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు లియో ఫార్మాలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసిపడి కంపెనీ మెుత్తం వ్యాపించాయి. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కొందరు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి కార్మికుల పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. అగ్నిప్రమాదంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. కంపెనీలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన కెమికల్ వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.