Minister Amabati On Pawan Kalyan : పవన్ రాజకీయ స్పష్టత లేని వ్యక్తి, బీజేపీని నడిరోడ్డుపై వదిలేశారు - మంత్రి అంబటి
Minister Amabati On Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తుకున్నారో తనకే తెలియదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీని రోడ్డున వదిలేశారని ఎద్దేవా చేశారు.
Minister Amabati On Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నట్టు చెబుతున్నారని, అయితే ఆత్మకూరులో మాత్రం ఆయన ఆ పార్టీని రోడ్డున వదిలేసి తన పని తాను చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. అసలు పవన్ కల్యాణ్ సింగిల్ గా ఉన్నారా.. ఒకవేళ పొత్తులో ఉంటే, బీజేపీతోనా, టీడీపీతోనా అని అంబటి ప్రశ్నించారు. కొంతకాలం వాళ్లతో, కొంతకాలం వీళ్లతో ఉండే పవన్ అందరినీ కలబోసుకుని ఉండాలనుకునే రాజకీయ స్పష్టత లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. జనసేన పొత్తులపై మంత్రి అంబటి సెటైర్లు పేల్చారు.
మంత్రులపై మండిపడ్డ బీజేపీ
ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార పార్టీ తరపున ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారానికి వస్తున్నారు. బీజేపీ తరపున కూడా హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు నాయకులు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదని విమర్శించారు. రైతులకు కూడా తీవ్ర అన్యాయం జరిగిందని, అస్తవ్యస్త విధానాలతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని, దీనికి కారణం మంత్రులేనని అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం ప్రభుత్వ పనితీరుకి, మంత్రి పనితీరుకి నిదర్శనం అని విమర్శించారు పురందేశ్వరి.
బీజేపీకి కౌంటర్
దీనికి కౌంటర్ గా మంత్రుల బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. అంబటి రాంబాబు బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు బీజేపీ తాము రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పుకోవాలని, అంతే కాని వైసీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే వారు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు అంబటి రాంబాబు. ఆయన పొత్తుల వ్యవహారంపై సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదని, ఇప్పటి వరకు ఆయన చాలా పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు ఎవరితో పొత్తులో ఉన్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో పవన్ కల్యాణ్ బీజేపీని ఒంటరిగా వదిలేశారని విమర్శించారు.
ఇంకా మూడు రోజులే
ఎన్నికలకు ఇంకా మూడు రోజులే టైమ్ ఉండటంతో మంత్రులంతా ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక మంత్రి, మరో ఎమ్మెల్యేని ఇన్ ఛార్జ్ గా నియమించారు. వారంతా ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా మండలాల్లో కలియదిరుగుతున్నారు. పోలింగ్ శాతం పెంచాలని స్థానిక నాయకులకు సూచిస్తున్నారు.