Lokesh Letter to CM Jagan: ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ తక్షణమే చేపట్టాలి - సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ తక్షణమే చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Lokesh Letter to CM Jagan:
ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ తక్షణమే చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రతి ఏటా జరిగే ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ ను ఏపీ సర్కారు రద్దు చేయడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కనుక తక్షణమే కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ సీఎం జగన్ కు రాసిన లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు.
లోకేష్ రాసిన లేఖలో ఏముందంటే..
‘మీ (జగన్) రివర్స్ పాలనలో ఇప్పటికే అన్నిరంగాలు 30 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా మీకు అలవాటైన రివర్స్‌లో చేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం చేశారు. ప్రతి ఏడాది తరహాలో జరగాల్సిన 3వ విడత కౌన్సెలింగ్ రద్దుచేసి విద్యార్థులకి తీరని ద్రోహం చేశారు. మీకు ఇద్దరు పిల్లలున్నారు. రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ మేనమామనంటావు. కనీసం తండ్రి మనసుతో ఆలోచించినా మంచి బ్రాంచిలో ఇంజనీరింగ్ చేయాలనే కలలు కల్లలైన పిల్లలు చేతులు కోసుకుంటూ, రక్తాలతో రాస్తున్న లేఖలు చూసైనా మనసు కరగదా?’ అని జగన్ కు రాసిన లేఖలో నారా లోకేష్ ప్రశ్నించారు.
‘మూడో విడత కౌన్సెలింగ్‌లోనైనా కోరుకున్న బ్రాంచి వస్తుందని నిరీక్షిస్తున్న వేలమంది విద్యార్థులు, నీ నిర్ణయాలతో తల్లిదండ్రులకి మొఖం చూపించలేక ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. తొలి విడతల్లో దూరప్రాంత కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులు 3వ విడత కౌన్సెలింగ్ కోసం నిరీక్షిస్తుంటే.. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుండటం వారికి తీరని అన్యాయం చేయడమే.
కౌన్సెలింగ్ డేట్ ఇస్తామని విద్యార్థులకి హామీ ఇచ్చి మరీ మంత్రి బొత్స సత్యనారాయణ మోసగించారు. ప్రతి ఏడాది మూడు విడతలు కాగా, ఈ ఏడాది 2 విడతలకే పరిమితం చేయడం ఉద్దేశమేంటో ప్రభుత్వం వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి. స్పాట్ అడ్మిషన్లకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక్కర్లేదని, కౌన్సెలింగ్ సీట్లయితే చెల్లించాల్సి వస్తుందనే 3వ విడత కౌన్సెలింగ్ రద్దు చేయడం అన్యాయం. స్పాట్ అడ్మిషన్లు, కన్వీనర్ కోటాలో సీఎస్ఈ సీట్లన్నీ అమ్ముకునేందుకు విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అక్రమ కేసులో మమ్మల్ని అరెస్టు చేసేందుకు పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు రాష్ట్ర సమస్యలపై పెట్టి ఉంటే వ్యవస్థలు ఇంత అస్తవ్యస్తంగా తయారయ్యేవి కావు. విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలు ఆగేవి. తక్షణమే 3వ విడత కౌన్సెలింగ్ తక్షణమే చేపట్టాలి’ అని సీఎం జగన్ కు రాసిన లేఖలో లోకేష్ డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఉన్నత విద్యామండలి షాక్..
ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఏపీ ఉన్నత విద్యామండలి షాకిచ్చింది. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 18 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది.
ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 30 వేల సీట్లు మిగిలిపోయాయి. వీటిని కళాశాలలు స్పాట్ కింద భర్తీ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలితే కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. వీటికి బోధన రుసుములు చెల్లిస్తారు. స్పాట్ తర్వాత సివిల్, మెకానికల్ తప్ప ఇతర బ్రాంచిల్లో సీట్లు ఉండవు. ఉన్నవి కూడా నాణ్యత లేని కళాశాలల్లో మాత్రమే ఉంటాయి. ఆసక్తి ఉన్నా లేకపోయినా వీటిల్లోనే చేరాల్సిన పరిస్థితి తలెత్తుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.