(Source: ECI/ABP News/ABP Majha)
Nara Lokesh: నారా లోకేష్ కీలక నిర్ణయం, రేపు ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఈ దీక్ష చేయనున్నారు.
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఈ దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నిర్ణయించారు. వారి దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు. టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీక్షలో టీడీపీ పలువురు ఎంపీలు పాల్గొనబోతున్నట్లు సమాచారం.
రేపు జైల్లో చంద్రబాబు దీక్ష
గాంధీ జయంతి రోజున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరామని, ఆయన అంగీకరించారని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి ఒక నిరాహార దీక్ష చేస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు గాంధీ జయంతి రోజున నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 97 మంది మృతి
చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక దాదాపు 97 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందని అచ్చెన్నాయుడుఅన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు కలిసి ధైర్యం చెబుతామని తెలిపారు. మరోవైపు జనసేన తెలుగుదేశం జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు అచ్చెన్న వెల్లడించారు. త్వరలోనే తెలుగుదేశం, జనసేన నుంచి కొంతమందితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే తాము కలిసి పనిచేస్తున్నామని అచ్చెన్నా స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. జగన్ రెడ్డి కనుసన్నలో ప్రభుత్వ అధికారులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నుంచి 4 రోజుల పాటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారని.. ఇందులో టీడీపీ శ్రేణులు పాల్గొని సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా చెప్పారు.
సుప్రీంకోర్టులో సవాల్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 9న సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కుంభకోణం జరిగినట్లు సీఐడీ పేర్కొంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు విడుదల చేసిన రూ.371 కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ అధినేత ఖండించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతవారం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.