Anna Canteens: అన్న క్యాంటీన్ లకు నారా భువనేశ్వరి కోటి రూపాయల విరాళం
Anna Canteens: ఏపీ వ్యాప్తంగా రేపు అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.కోటి విరాళం అందజేశారు.
Nara Bhuvaneswari Donation to Anna Canteens: ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఆగస్ట్ 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను పలువురు మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ మేరకు విరాళం చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందించారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్ల కార్యక్రమం ఎంతో గొప్పదని భువనేశ్వరి పేర్కొన్నారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనేది ఎన్టీఆర్ నినాదమని భువనేశ్వరి గుర్తు చేశారు.
భువనేశ్వరి ట్వీట్
విరాళం అందించిన విషయాన్ని భువనేశ్వరి ట్వీట్ చేశారు. అందులో..‘‘ అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామం. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నాను. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అంటూ రాసుకొచ్చారు.
అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామం. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం… pic.twitter.com/mPDlfnx3OB
— Nara Bhuvaneswari (@ManagingTrustee) August 14, 2024
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే..
ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతుగా విరాళం అందజేస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఐదు రూపాయలకే పేదల కడుపు నింపడం అనేది గొప్ప కార్యక్రమం... పేదలు, రోజు కూలీలు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైనదని తాను పేర్కొన్నారు. పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టాలని సూచించారు.
మరో కోటి విరాళం
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ కోటి రూపాయలను ఈ సంస్థ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు సచివాలయంలో చంద్రబాబును కలిసి విరాళం తాలూకా చెక్కును అందజేశారు. వచ్చే ఐదేళ్ల పాటు అన్న క్యాంటీన్ల కోసం కోటి రూపాయల విరాళం ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను అభినందించారు.
పేదల ఆకలి నుంచి పుట్టిందే తెలుగుదేశం
పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకన్న నినాదంతోనే ఎన్ టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గతంలో టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వీటిని మూసివేసినా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లు గురువారం తిరిగి ప్రారంభం కానున్నాయి.