Pawan Kalyan : వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను, ఆ విషయంపై బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడతా : పవన్ కల్యాణ్
Pawan Kalyan : 2019 ఎన్నికల్లో చారిత్రక తప్పు జరిగిందని వచ్చే అది రిపీట్ అవ్వకుండా చూస్తామని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఈ విషయంపై బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడతానన్నారు.
Pawan Kalyan : 2019లో ఏపీలో చారిత్రక తప్పు జరిగిందని 2024లో అది రిపీట్ అవ్వకుండా చూస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర పరిస్థితులు బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలియజేసి వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానన్నారు. మళ్లీ ఓట్లు చీలిపోతే వైసీపీ వాళ్లే వస్తారన్నారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను
"నాకు ఏ పార్టీపై వ్యక్తిగత ఆపేక్ష లేదు. ప్రజలు బాగుండాలి. ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదు. జనసేన అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది యువతకు పదిలక్షల మందికి ఉపాధి ఇచ్చే ఆలోచనలు చేస్తాం. అదే మేం ఆలోచిస్తున్నాం. యువత ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి ఎవరు బలమైన భవిష్యత్ ఇవ్వగలరని యువత ఆలోచించాలి. వ్యక్తిగతంగా నేతలను తిడితే ప్రజలకు న్యాయం జరుగుతుందంటే పుట్టుపూర్వత్తరాలతో తిట్టగలను. మీరు చెప్పిన మాటనే అడుగుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధం. అదే టైంలో వ్యతిరేక ఓటును చీలిపోనివ్వను. నేను పంతాలకు వెళ్లి మొదటికే మోసం తెచ్చే ప్రయత్నాలు చేయను. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉంది. దిల్లీలో అడుదామంటే ఒక్క ఎంపీ కూడా రాడే.. నేను మాట్లడతాను. నాకు కేసుల్లాంటి భయాల్లేవు. మీ తరఫున పోరాటం చేయడానికి నాకు మద్దతు ఇవ్వండి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నాను అందుకే వేసే ప్రతి అడుగును మీకు చెప్పే వేస్తాను. ప్రజల అజండానే నా అజెండా" అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎవరి జెండాలు, అజెండాలు మోసే వ్యక్తిని కాదు
ప్రజల అజెండా తప్ప ఎవరి జెండాలు, అజెండాలు మోసే వ్యక్తిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని కేవలం వ్యూహాలే ఉంటాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. వైసీపీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న పదవి కంటే తనకు ఏదీ ఎక్కువ కాదన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా, వద్దా అనే తమ సొంత నిర్ణయం అన్నారు. సింగిల్‌గా రావాలని అడిగేందుకు వైసీపీ నేతలెవరని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులు దొంగచాటున చేయనన్నారు. సింగిల్‌గా వచ్చి ప్రజల్ని చీల్చి చెండాడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు.