AP High Court: జగన్ అవినీతిపై సీబీఐ విచారణకు రఘురామ డిమాండ్ - హైకోర్టులో వాదనలు
Raghu Rama Pil: జగన్ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తనపై ఉన్న క్రిమినల్ కేసులు దాచిపెట్టిన పిటిషనర్ కు అర్హత లేదన్న ఏజీ
Jagan Case: ఏపీ ముఖ్యమంత్రి జగన్(Jagan), ఆయన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు మధ్య టామ్ అండ్ జెర్రీ పోటీ నడుస్తూనే ఉంది. సీఐడీ(CID) కేసు, పోలీసుల కొట్టడాన్ని మనసులో పెట్టుకున్న రఘురామ...జగన్ పై కోర్టులో కేసుల దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా సీఎం జగన్(Jagan) తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని...దీనిపై సీబీఐ(CBI) విచారణ జరిపించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju)దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు విచారించింది.
సీబీఐకి అప్పగించండి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని..ప్రభుత్వ కాంట్రాక్ట్ లన్నీ అధిక మొత్తం పెంచి ఆయన అనుయాయులకే అప్పగిస్తున్నారంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు(High Court) విచారించింది. జగన్ అవినీతికి పాల్పడ్డారని, సీబీఐ(CBI) కేసులో తనతోపాటు ఉన్నవారికి మేలు జరిగేలా వ్యవహరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పుడు జగన్(Jagan) పెద్దఎత్తున క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ భూములను దోచిపెట్టినందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లోకి పెద్దఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తాయని దీనిపై విచారణ జరిపిన సీబీఐ జగన్ సహా పలువురు కీలక పారిశ్రామికవేత్తలు, అధికారులపై కేసులు నమోదు చేసింది. అప్పట్లో వారికి కేటాయించిన భూములు రద్దు చేసింది. దీంతో వారు పెద్దఎత్తున నష్టపోయినా... జగన్ మాత్రం భారీగా లాభపడ్డారు. ఇప్పుడు తాను ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటంతో అప్పుడు సీబీఐ కేసుల వల్ల నష్టపోయిన వారిని మరోసారి ఆయన ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా పూడ్చేందుకు మరోసారి జగన్ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా మరోసారి ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి వైసీపీ పాలనలో కేటాయింపులు, ముఖ్యంగా జగన్ అనుయాయులకు ఇచ్చిన కాంట్రాక్టులన్నింటిపై మరోసారి సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
కేసులు దాచారు
జగన్ పై పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజుపై క్రిమినల్ కేసులు ఉన్నాయని..ఈ విషయాన్ని ఆయన కోర్టుకు చెప్పలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ కు సీఎం జగన్ కు మధ్య విభేదాలు ఉన్నాయని..కక్షగట్టి కావాలనే ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు. సీఎం జగన్ గౌరవానికి భంగం కలిగించేలా ఆయన వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ పిల్ వేసేందుకు ఆయన అనర్హుడంటూ వాదనలు వినిపించారు. కేవలం సంచనలం కోసమే ఇలాంటి పిటిషన్ దాఖలు చేస్తున్నందున ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ మార్చి 4కు వాయిదా వేసింది.