Undavalli : ఏపీకి న్యాయం కోసం ఇప్పటికైనా పోరాడాలి - మోదీ వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా !
ఏపీకి అన్యాయం జరిగిందన్న మోదీ చెప్పారు కాబట్టి న్యాయం కోసం ఆయను ప్రశ్నించాలని సీఎం జగన్‌కు ఉండవల్లి సూచించారు. లేకపోతే భవిష్యత్‌లో అసలు ఏపీనే ఎవరూ పట్టించుకోరన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం ఏమిటి ? ఎలా సరిదిద్దుతారో కూడా ప్రధాని మోదీ చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి స్పందించారు. విభజన బిల్లును లోపభూయిష్టంగా ఉందని.. చర్చ లేకుండా ఆమోదించారని ఉండవల్లి విమర్శించారు. రాజధాని లేకుండా బిల్లు ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. తలుపులు మూసేసి ప్రజాస్వామ‌్య విరుద్ధంగా విభజన చేశారన్న మోదీ మాటలు కరెక్టేనన్నారు. ఏం జరిగిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అంటే అలుసైపోయిందని.. ప్రధాని అన్న మాటలన్నా ఒక్క ఎంపీ కూడా నోటీసు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయని విమర్శించారు. విభేధించిన ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ కేసులతో భయపెడుతోందన్నారు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఏపీకి ఇక ముందు ఎవరూ పట్టించుకోరన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజలు అడిగినన్నీ సీట్లు ఇచ్చి చక్రవర్తిగా కూర్చోబెట్టారని .. మోదీ అన్న మాట మాటలనే ఆయకు గుర్తు చేసి.. విభజన అంశాలపై ప్రస్తావించాలని.. తమకు ఎందుకు ముంచేశారో అడగాలని జగన్‌ను కోరారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు ఏపీ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విభజించాయని ఉండవల్లి స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో ఏపీ అంటే అసలు ఎవరూ పట్టించుకోరన్నారు. ఉండవల్లి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. ఫిబ్రవరిలోనే కరెంట్ కోతలు ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయోనని వ్యాఖ్యానించారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు విభజన జరిగిన తీరు చెల్లదని సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్ దాఖలు చేశారు. దేశ చరిత్రలో పార్లమెంట్ నిబంధనలన్నీ ఉల్లంఘించి... రాజ్యాంగ వ్యతిరేకంగా విభజన చట్టాన్ని ఆమోదించారు ఉండవల్లి వాదిస్తున్నారు. దీనిపై ఆయన ఓ పుస్తకం కూడా రాశారు. విభజన చట్టం రాజ్యసభలో పాస్ కాలేదని.. రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన లెక్కలే.. ఉండవల్లి పుస్తకంలో ఉన్నాయి. విభజన చట్టం పాస్ అయినప్పుడు రాజ్యసభలో 353 మంది ఉన్నారు. వారిలో 173 మంది సంతకాలు పెట్టలేదని ఉండవల్లి చెబుతున్నారు. ప్రధాని మోదీ ఇప్పుడు విభజన అంశంపై మాట్లాడటంతో ఉండవల్లి మరోసారి ప్రెస్ మీట్ అన్ని విషయాలను వివరించారు. విభజన బిల్లు పాస్ అవుతున్న సమయంలో ఉండవల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు.